మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. టోర్నీలో మొదటి మ్యాచ్‌కే పాకిస్థాన్‌తో తలపడిన భారత జట్టు.. అదరగొట్టింది. పాక్‌ను ఓడించిన ఉత్సాహంతో.. తన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను బుధవారం ఢీ కొట్టబోతోంది. అయితే ఇటీవలే భారత అమ్మాయిలు అండర్-19 వరల్డ్ కప్‌లో అదరగొట్టారు. అమ్మాయిల విభాగంలో మొదటి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఎలాగైనా మహిళల టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన లేంకుండా.. పాక్ టార్గెట్‌ను ఛేజ్ చేసింది. అయితే పాక్ మ్యాచ్‌లో ఆడలేకపోయిన స్మృతి.. వెస్టిండీస్ మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. ఇదే జరిగితే విజయోత్సాహంతో ఉన్న జట్టుకు మరింత బలం చేకూరుతుంది.
బౌలింగ్‌లో మెరుగుపడాలి..
పాక్ మ్యాచ్‌లో టీమ్ఇండియా బౌలర్లు కొంచెం తడబడ్డారు. చివరి 10 ఓవర్లలో 91 పరుగులు సమర్పించుకున్నారు. దీనిపై కొంచెం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వికెట్ల ఉన్నా.. లేకున్నా.. చివరి ఓవర్లలో బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నిస్తారు. అందుకే ఆఖరులో పరుగులను కట్టడి చేయాలి. పాక్ మ్యాచ్‌లో 18వ ఓవర్లో రిచా ఘోష్ మూడు ఫోర్లు బాదకుంటే.. మ్యాచ్ పాక్ చేతుల్లోకి వెళ్లేది. అలాంటి సమయంలో తక్కువ టార్గెట్ ఉంటే ఛేదన సులభమవుతుంది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లలో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలి. ఇటీవలే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత్ రెండు సార్లు గెలిచింది. ఆ అనుభవం ఇప్పుడు జట్టుకు ప్లస్ అవుతుంది.
బ్యాటర్లు పెద్ద షాట్లకు వెళ్లాలి..
టీమ్ఇండియా వరల్డ్ కప్ గెలవాలంటే బ్యాటింగ్ విభాగంలో ఇంకొంచెం మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్ షెఫాలీ వర్మ కూడా పాక్ మ్యాచ్‌లో పెద్ద షాట్లు ఆడలేకపోయింది. ఓపెనర్ స్మృతి మంధాన లేకపోవడం వల్ల.. యాస్తికా భాటియా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పరుగులు రాబట్టడంలో అంతగా ప్రభావం చూపించలేకపోయారు. బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అయితే, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా తమ స్ట్రైక్ రేట్‌ను పెంచుకోవాలి, పెద్ద షాట్లకు వెళ్లాలి. ఇక, స్మృతి మంధాన చేరిక బ్యాటింగ్‌ను బలపరుస్తుందనడంలో సందేహం లేదు.