ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టులో ఓటమి తప్పించుకునేందుకు భారత్ పోరాడుతోంది. మిథాలీసేనకు వరుణుడు కూడా కాస్త సహకారం అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడ్డ భారత్.. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ స్మృతి మంధాన (8) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తి శర్మ (18 బ్యాటింగ్)తో కలిసి అరంగేట్ర ఓపెనర్ షెఫాలి వర్మ (55 బ్యాటింగ్; 68 బంతుల్లో 11×4) జట్టును ఆదుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేసిన షెఫాలి.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ జోరును కొనసాగించింది. మూడో రోజు వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మిథాలీసేన ఇంకా 82 పరుగులు చేయాలి.
వరుణుడు పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించాడు. శుక్రవారం ఆటలో సగం ఓవర్లు కూడా పడలేదు. పూర్తి ఆట సాగితే ఈపాటికి భారత్ ఓటమి బాటలో ఉండేదేమో. అయినప్పటికీ ఇంకా ముప్పు తొలగిపోలేదు. చివరి రోజు భారత్ బలంగా నిలబడితేనే మ్యాచ్‌ను డ్రాగా ముగించడానికి అవకాశముంటుంది. అంతకుముందు మూడో రోజు ఉదయం 187/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 231 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ 29 పరుగులతో అజేయంగా నిలిచింది. సోఫీ ఎకిల్‌స్టోన్ (4/88), హెదర్ నైట్ (2/7) భారత్‌ను దెబ్బ తీశారు. భారత్‌ను ఇంగ్లాండ్ ఫాలోఆన్ ఆడించింది. తొలి ఇన్నింగ్స్‌ను ఆ జట్టు 396/9 వద్ద డిక్లేర్ చేసింది.
అదే దూకుడు
ఫార్మాట్ ఏదైనా సరే.. విధ్వంసక బ్యాటింగ్‌తో స్వల్ప వ్యవధిలో చేయాల్సిన నష్టమంతా చేసేయడం మాజీ ఓపెర్ వీరేంద్ర సెహ్వాగ్ శైలి. టెస్టుల్లో కూడా ఇదే శైలిలో అతను విజయవంతం అయ్యాడు. టీమ్‌ఇండియా సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మహిళల క్రికెట్‌లో సరిగ్గా షెఫాలి వర్మ కూడా ఇలాంటి ప్లేయరే. టీనేజీలోనే ఈ అమ్మాయి తనేంటో చాటిచెప్పింది. ఇప్పటికే మహిళ క్రికెట్లో మార్మోగింది. దూకుడైన ఆటతో టీ20లు, వన్డేల్లో ఆమె సత్తా చాటుకుంది. ఇప్పుడు టెస్టు క్రికెట్లోనూ అరంగేట్రంలోనే అదరగొట్టింది షెఫాలి. కఠినమైన ఇంగ్లాండ్ పరిస్థితుల్లో.. ఇంగ్లాండ్ మేటి బౌలర్లను ఎదుర్కొంటూ తొలి టెస్టులో ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మరీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాదిరి ఎడా పెడా షాట్లు ఆడేయలేదు. అదే సమయంలో సహజ శైలిని వీడి జిడ్డు బ్యాటింగ్ చేయలేదు. కాస్త ఓపిక పడుతూనే.. అవకాశం దొరికినపుడల్లా షాట్లు ఆడింది. అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసేలా కనిపించింది. అయితే శతకానికి 4 పరుగుల దూరంలో ఔటైపోయింది. సెంచరీ చేయకపోవడం పట్ల చింతిస్తూనే, మరో అవకాశం లభిస్తే వదిలిపెట్టను అన్న షెఫాలి.. అన్నట్లే రెండో ఇన్నింగ్స్‌లో మూడంకెల స్కోరును అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఫామ్ కొనసాగిస్తూ, దూకుడు మరింత పెంచుతూ ఆమె రెండో ఇన్నింగ్స్‌లో 68 బంతుల్లోనే 55 పరుగులతో అజేయంగా నిలిచింది. షెఫాలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు బౌండరీల (11 ఫోర్లు) ద్వారా వచ్చినవే కావడం విశేషం. ఫాలోఆన్ ఆడుతూ, జట్టు కష్టాల్లో ఉన్నప్పటికీ షెఫాలి మాత్రం ఆత్మరక్షణకు పోకుండా స్వేచ్ఛగా షాట్లు ఆడింది. ఈ అమ్మాయి జోరు కొనసాగిస్తూ సెంచరీ అందుకుంటే, అలాగే జట్టును డ్రాతో గట్టెక్కిస్తే టెస్టుల్లో ఆమె స్థానం సుస్థిరం కావడం ఖాయం.