ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డే(indw vs ausw 2021)లో భారత మహిళా జట్టు పోరాడి ఓడింది. ఆఖరి బంతి వరకు జరిగిన ఈ పోరులో వివాదాస్పద నోబాల్ కారణంగా ఆసీస్‌ను విజయం వరించింది. దీంతో వన్డే సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది భారత్. ఆఖరి వన్డే మ్యాచ్ ఆదివారం జరగనుంది. దీంతో వరుసగా మూడో సిరీస్‌ను భారత్ కోల్పోవడం గమనార్హం. ఇంతకుముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ చేతుల్లో మిథాలీ సేన పరాజయం పాలైంది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 274 పరుగులు చేసింది. స్టైలిష్ ఓపెనర్ స్మృతి మంధాన 86 పరుగులతో రాణించగా.. రిచా గోష్ (44) పర్వాలేదనిపించింది. మిగిలిన వారిలో షెఫాలీ (22), దీప్తి శర్మ (23), పూజా వస్త్రాకర్ (29), జులాన్ గోస్వామి (28) కాసేపు క్రీజులో నిలిచారు. దీంతో ఆసీస్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భారత్.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే అలిసా హేలీని క్లీన్ బౌల్డ్ చేసింది గోస్వామి. మెగ్ లాంగ్ (6), ఎలిస్ పెర్రీ (2), గార్డెనర్ (12) కూడా విఫలమవడం వల్ల 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్. కానీ మరో ఓపెనర్ బెత్ మూనీతో కలిసి మెక్‌గ్రాత్ జట్టును విజయతీరాలకు చేర్చింది. మూనీ సెంచరీ (125*)తో నాటౌట్‌గా నిలవగా.. మెక్‌గ్రాత్ 74 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.