తెలంగాణ

telangana

ETV Bharat / sports

అలా జరిగితే ప్రపంచకప్​ టీమ్​ఇండియాదే: మిథాలీ రాజ్​

Women world cup 2022 MITHALI RAJ: తన కెరీర్‌ ముగింపునకు వచ్చేసిందని భారత మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. ప్రపంచకప్‌ కల మాత్రమే ఇంకా మిగిలి ఉందని చెప్పింది. అయితే జట్టులో తమ క్రికెటర్లంతా మెరుగ్గా ఆడితేనే ప్రపంచకప్​ అందుకునే అవకాశం వస్తుందని పేర్కొంది. టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండడం తమకు సానుకూలాంశమని వెల్లడింటింజియ

మిథాలీ రాజ్​
mithali raj

By

Published : Mar 2, 2022, 7:03 AM IST

Women world cup 2022 MITHALI RAJ: రెండు దశాబ్దాల కింద తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన మిథాలీ రాజ్‌.. ఇప్పుడు ఆరోసారి మెగా టోర్నీకి సిద్ధమవుతోంది. కానీ ఈ టోర్నీ తర్వాత.. మరో ప్రపంచకప్‌లో ఆమె కనపడదు. 22 ఏళ్ల తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఇక ముగించాలనుకుంటున్నానని 39 ఏళ్ల మిథాలీ ప్రకటించింది. ఆమెకు ఇదే చివరి ప్రపంచకప్‌ అన్నది స్పష్టం. 2000లో ఆమె ఆడిన తొలి ప్రపంచకప్‌, ప్రస్తుత ప్రపంచకప్‌కు వేదిక న్యూజిలాండే కావడం విశేషం. "2000 ప్రపంచకప్‌ నుంచి విజయవంతమైన ప్రయాణం చేశా. ఆ టోర్నీ కూడా న్యూజిలాండ్‌లోనే జరిగింది. టైఫాయిడ్‌ కారణంగా ఆ ప్రపంచకప్‌ (కొన్ని మ్యాచ్‌లకు)నకు దూరమయ్యా. ఇప్పుడు అదే న్యూజిలాండ్‌లో ఉన్నా. ఎక్కడ మొదలుపెట్టానో అక్కడికే వచ్చేశా. ఇక ఈ ప్రయాణాన్ని ముగించాలనుకుంటున్నా" అని ఐసీసీ పోస్ట్‌ చేసిన వీడియోలో మిథాలీ చెప్పింది.

అందరూ బాగా ఆడితే..

ప్రపంచకప్‌లో తమ క్రికెటర్లంతా మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నానని మిథాలీ చెప్పింది. "జట్టు సభ్యులంతా రాణించాలని కోరుకుంటున్నా. అలా జరిగితే ఇప్పటివరకూ అందని ప్రపంచకప్పును అందుకునే అవకాశం వస్తుంది" అని అంది. ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత్‌ 1-4తో పరాజయంపాలైంది. కానీ నిలకడగా 250+ స్కోర్లు చేయగలిగింది. ఈ నేపథ్యంలో మిథాలీ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నామని చెప్పింది. జట్టుగా మేం ఈ ప్రపంచకప్‌లో మెరుగుపడాలనుకుంటున్న అంశాలపై గత సిరీస్‌లోనే దృష్టి సారించామని తెలిపింది. "దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మేం తడబడ్డ మాట నిజమే. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో సిరీస్‌ల్లో నిలకడగా 250పై స్కోర్లు సాధించాం. ప్రపంచకప్‌లో అంతకన్నా మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం" అని మిథాలీ తెలిపింది.

వాళ్లుండడం సానుకూలాంశం..

టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండడం తమకు సానుకూలాంశమని మిథాలీ రాజ్‌ చెప్పింది. "తుది జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండడం మంచి విషయం. అది జట్టుకు లాభిస్తుంది. ఎడమ, కుడి మేళవింపు ప్రత్యర్థి కెప్టెన్‌, బౌలర్లు, ఫీల్డర్లకు సమస్యలు సృష్టిస్తుంది" అని ఆమె వివరించింది. మిథాలీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. నిరుడు క్రికెట్‌ పునురుద్ధరణ జరిగినప్పటి నుంచి తొమ్మిది అర్ధసెంచరీలు సాధించింది. తన ఫామ్‌పై ఆమె స్పందిస్తూ.. "నేనెప్పుడూ ఆట ప్రాథమికాంశాలకు కట్టుబడి ఉంటా. ఎందుకంటే కీలక మ్యాచ్‌ల్లో, తీవ్ర ఒత్తిడి ఎదురైనప్పుడు సంయమనంతో ఉండడం కష్టం. ప్రాథమికాంశాలకు కట్టుబడితే.. అది ఉపకరిస్తుంది" అని చెప్పింది.

ప్రపంచకప్‌లో సత్తా చాటితే..

ప్రపంచకప్‌లో గట్టి ప్రదర్శన చేస్తే.. భారత మహిళల జట్టుకు అభిమానుల ఆదరణ పెరిగే అవకాశముంటుందని మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. "మా జట్టులో ప్రతి అమ్మాయి పేరు అందరి నోళ్లలో నానుతుందని ఆశిస్తున్నా. దేశంలో బాలికలు ఇంకా చాలా మంది మహిళా క్రికెటర్లను ఆదర్శంగా తీసుకుంటారని అనుకుంటున్నా. బాలికలే కాదు.. బాలురు కూడా మహిళా క్రికెటర్ల నుంచి స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే ఈ మహిళా క్రికెటర్లు ఎంతో కష్టపడ్డారు. ఈ స్థితిలో ఉండడానికి ఎన్నో త్యాగాలు చేశారు" అని చెప్పింది.

మిథాలీ రెండో స్థానంలోనే..

మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ మిథాలీరాజ్‌ రెండో ర్యాంకులో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మిథాలీ 735 రేటింగ్‌ పాయింట్లతో రెండో ర్యాంకుని నిలబెట్టుకుంది. ఈ జాబితాలో మరో భారత తార స్మృతి మంధాన (666) ఎనిమిదో ర్యాంకులో ఉంది. కివీస్‌తో ఆఖరి వన్డేలో మిథాలీతో పాటు స్మృతి అర్ధసెంచరీ చేసింది. అలీసా హీలీ (ఆస్ట్రేలియా, 749) నంబర్‌వన్‌గా ఉంది. బౌలర్లలో దీప్తిశర్మ (580) ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 12వ ర్యాంకులో నిలిచింది. కివీస్‌తో నాలుగో వన్డేలో ఒక వికెట్‌ తీసిన దీప్తి.. అయిదో వన్డేలో రెండు వికెట్లు పడగొట్టింది. వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి (695)కి మాత్రమే టాప్‌-10లో చోటు దక్కింది. ఆమె నాలుగో ర్యాంకులో కొనసాగుతోంది. జెస్‌ జాన్సన్‌ (ఆస్ట్రేలియా, 762) టాప్‌ ర్యాంకు సాధించింది. ఆల్‌రౌండర్లలో దీప్తిశర్మ (309) అయిదో ర్యాంకులో నిలవగా.. ఎలిస్‌ పెర్రీ (438) అగ్రస్థానంలో ఉంది.

మరో రెండు రోజుల్లో..

మరో రెండు రోజుల్లో మహిళల ప్రపంచ కప్ మొదలవ్వబోతుంది. మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తిరుగు లేని శక్తులు, దశాబ్దాలుగా ఆ జట్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రపంచకప్ లోనూ అదే ఆధి పత్యం. ఈసారి కూడా ఈ జట్లే ఫేవరెట్లు. తొలి ప్రపంచకప్ (1973) నుంచి 2017 వరకు ఒక్కసారి మినహాయిస్తే, అన్నిసార్లూ ఆసీస్ ఐ ఇంగ్లాండ్లో కప్పును చేజిక్కించుకు న్నాయి. ఆస్ట్రేలియా ఆరుసార్లు, ఇంగ్లాండ్ నాలుగుసార్లు విజేతలుగా నిలిచాయి. ఒక్క సారి (2000) టైటిల్ సాధించిన న్యూజిలాండ్.. మూడుసార్లు రన్నరప్ గా నిలిచింది. భారత్ కల మాత్రం నెరవేరలేదు. రెండుసార్లు రన్నరప్ గా నిలిచింది. 2005 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో, 2017 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ రెండు సార్లూ మిథాలీ రాజ్ నేతృత్వంలోనే భారత్ బరిలోకి దిగింది. ఈసారైనా భారత్ కల నెరవేరుతుందో లేదో చూడాలి. ఈ నెల 6న పాకిస్థాన్తో మ్యాచ్లో భారత జట్టు కప్పు వేట మొదలవుతుంది.

ఇదీ చదవండి: Womens World cup 2022: ప్రపంచకప్‌.. మిథాలీ కల తీరేనా

ABOUT THE AUTHOR

...view details