Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ నుంచి సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది టీమ్‌ఇండియా. ఆదివారం చివరివరకు ఉత్కంఠగా జరిగిన లీగ్ ఆఖరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు.. 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్ గెలిచింది. దీంతో ప్రపంచకప్ గెలవాలనే మిథాలీ సేన ఆశలు గల్లంతయ్యాయి.
టీమ్‌ఇండియా నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాంతో దక్షిణాఫ్రికా జట్టు బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు బాగా రాణించారు. లారా వోవార్డ్ (80), లారా గూడల్ (49), కెప్టెన్ సున్ లూస్ (22), మిగ్నాన్ డు ప్రీజ్ (52 నాటౌట్), మారిజాన్నె కాప్ (32) బాధ్యతాయుతంగా ఆడారు. ఆఖర్లో టీమ్‌ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఓ దశలో విజయం సాధించేలా కనిపించింది. కాగా, చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా.. విజయానికి 7 పరుగులు అవసరమైన స్థితిలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. తొలి బంతికి సింగిల్ సాధించిన దక్షిణాఫ్రికా.. రెండో బంతికి చెట్టీ (7) వికెట్ కోల్పోయింది. ఆమె రనౌటవ్వడం వల్ల సమీకరణం నాలుగు బంతుల్లో 5 పరుగులుగా మారింది. దీంతో క్రీజులో ఉన్న మిగ్నాన్, షబ్నిమ్ (2) సింగిల్స్‌పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఐదో బంతికి మిగ్నాన్ భారీ షాట్ ఆడి హర్మన్‌ప్రీత్ కౌర్ చేతికి చిక్కినా.. అది నోబాల్‌గా నమోదైంది. దీంతో సంబరాల్లో మునిగిన భారత్‌కు నిరాశ మిగిలింది. చివరి రెండు బంతులకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు సింగిల్స్ తీయడంతో భారత్ ఓటమిపాలైంది.