తెలంగాణ

telangana

ETV Bharat / sports

CWG 2022: 'పసిడి' పోరులో భారత్ గెలిచేనా?.. ఆస్ట్రేలియాతో ఫైనల్ సమరానికి సిద్ధం! - కామన్వెల్త్ గేమ్స్​ 2022

INDw vs AUSw: కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌ విభాగంలో టీమ్‌ఇండియా.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత్‌, ఆసీస్‌ జట్ల బలాలు.. అనుకూలతలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం..

women common wealth final match
women common wealth final match

By

Published : Aug 7, 2022, 6:00 PM IST

INDw vs AUSw: కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌ విభాగంలో టీమ్‌ఇండియా పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గ్రూప్‌స్టేజ్‌లో ఓడించిన ఆసీస్‌ను ఢీకొట్టి స్వర్ణం గెలవాలంటే టీమ్‌ఇండియా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు. ఈ క్రమంలో భారత్‌, ఆసీస్‌ జట్ల బలాలు.. అనుకూలతలు ఏంటో చూద్దాం..

ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ అద్భుత విజయం సాధించింది. మరోవైపు రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మీద గెలిచి ఆస్ట్రేలియా తుదిపోరుకు సిద్ధమైంది. గ్రూప్‌ స్టేజ్‌లో ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైన భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. నాకౌట్‌ దశలో ఆసీస్‌ను తక్కువగా అంచనా వేయకూడదు. ఎలాంటి దశలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల ప్లేయర్లు ఆ జట్టు సొంతం. ఒత్తిడిలో ప్రత్యర్థిపై పట్టు సాధిచంగలరు.

తొలి మ్యాచ్‌ గుణపాఠం నేర్చుకోవాలి..
బ్యాటింగ్‌లో తొమ్మిదో స్థానం వరకు పరుగులు రాబట్టే సత్తా ఆసీస్‌ క్రీడాకారిణులకు ఉంది. దానికి ఉదాహరణ భారత్‌తో జరిగిన తొలి మ్యాచే. టాప్‌ ఆర్డర్‌ను త్వరగానే పెవిలియన్‌కు చేర్చిన టీమ్ఇండియా కాస్త పట్టు విడవడంతో లోయర్‌ఆర్డర్‌ బ్యాటర్లు తమ జట్టును గెలిపించుకున్నారు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 154/8 స్కోరు సాధించగా.. లక్ష్య ఛేదనలో ఆసీస్‌ 110 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అటువంటి స్థితి నుంచి మ్యాచ్‌ గెలవడం సాధారణ విషయం కాదు. గార్డెనర్‌ (52*) చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఆసీస్‌ను గెలిపించింది. అందుకే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఓటమి ముప్పు తప్పదని మొదటి మ్యాచ్‌లోనే తేలింది.

బ్యాటింగ్, బౌలింగ్‌ ఫర్వాలేదు కానీ..
భారత బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణిస్తున్నప్పటికీ.. ఎప్పుడు ఎలా ఆడతారో అంతుచిక్కని విధంగా ఉంది. గత సెమీస్‌ మ్యాచ్‌లోనూ ఓ దశలో ఓటమిబాట పడతారేమోనని అనిపించింది. అయితే కీలక సమయాల్లో ఓ నాలుగు ఓవర్లను కట్టుదిట్టంగా వేయడంతో ఇంగ్లాండ్‌ను ఓడించగలిగింది. అటు బ్యాటింగ్‌లోనూ ఓపెనర్‌ స్మృతీ మంధాన దూకుడు చూస్తే టీమ్‌ఇండియా స్కోరు 200కి చేరువగా వస్తుందని అంతా భావించారు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లు చేజార్చుకోవడంతో ఓ మోస్తరు (164) స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. స్వర్ణం గెలవాలంటే మాత్రం ప్రస్తుత ప్రదర్శన కంటే దూకుడైన గేమ్‌ను ఆడాల్సిందే. అటువైపు ప్రత్యర్థి ఆసీస్‌.. వారికి కాస్త పట్టు జారవిడిస్తే కోలుకోని లేనివిధంగా దెబ్బ కొడతారు. మంధానతోపాటు షఫాలీ, హర్మన్‌ప్రీత్, రోడ్రిగ్స్‌, తానియా భాటియా/యస్తికా భాటియా.. టాప్‌ ఆర్డర్‌ రాణించి ఆసీస్‌ ఎదుట భారీ లక్ష్యం నిర్దేశించాలి. కనీసం 180కిపైగా టార్గెట్‌ ఉంటే మాత్రం ఆసీస్‌ను నిలువరించడం భారత బౌలర్లకు తేలికవుతుంది.

మరోసారి రేణుక మ్యాజిక్‌ స్పెల్‌ కావాలి
గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన స్వింగ్‌ బౌలర్ రేణుకా సింగ్‌ సెమీస్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మూడు ఓవర్లు వేసిన రేణుక 31 పరుగులు సమర్పించి ఒక్క వికెట్టూ తీయలేకపోయింది. అయితే ఫైనల్‌లో ఆరంభంలోనే వికెట్‌ తీసి భారత్‌కు బ్రేక్‌ ఇవ్వాలి. మరోసారి స్వింగ్‌ మ్యాజిక్‌ను ప్రదర్శించాలి. మరోవైపు కరోనా నుంచి కోలుకుని వచ్చిన ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ కూడా సెమీస్‌లో తన స్థాయి ఆటను మాత్రం ఆడలేదు. బౌలింగ్‌లోనూ వికెట్‌ తీయలేదు. అద్భుతంగా బంతులను సంధిస్తున్న దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, రాధా యాదవ్‌ మరోసారి తమ అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనను ఆసీస్‌పై చూపించాలి.

ఇదీ చదవండి:బాక్సింగ్​, ట్రిపుల్​ జంప్​లో మూడు గోల్డ్​.. ఫైనల్​కు సింధు.. హాకీలో అమ్మాయిలకు కాంస్యం

ABOUT THE AUTHOR

...view details