Windies Player Fell Down: మహిళల ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ క్రీడాకారిణి షమిలియా కానెల్ అకస్మాత్తుగా మైదానంలో కుప్పకూలింది. దీంతో హుటాహుటిన ఆమెను వైద్యబృందం ఆసుపత్రికి తరలించింది. అయితే కానెల్‌కు ఎలాంటి ప్రమాదం లేదని జట్టు సారథి స్టఫానీ టేలర్ వెల్లడించింది. తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటుందో లేదో ఇప్పుడేమీ చెప్పలేమని తెలిపింది.
"ఆమెను అలా చూడటం కాస్త ఆందోళన కలిగించింది. ఆమె పోరాట యోధురాలు. తప్పకుండా మామూలు స్థితికి తిరిగి వచ్చేస్తుందని ఆశిస్తున్నాం" అని ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ హేలే మాథ్యూస్ (18 పరుగులు, 4/15) పేర్కొంది.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విండీస్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 140 పరుగులే చేయగలిగింది. క్యాంప్‌బెల్ (53*) అర్ధశతకం సాధించడంతో ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో మాథ్యూస్ (4/15), ఫ్లెచెర్ (3/29), టేలర్ (3/29) విజృంభించడంతో బంగ్లాదేశ్ 49.3 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ (4)ను వెనక్కి నెట్టి విండీస్ (6) మూడో స్థానానికి చేరుకుంది. టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు చాలా కీలకం. ఈ క్రమంలో శనివారం ఆసీస్‌తో భారత్ తలపడనుంది.
ఇదీ చూడండి:చెర్రీ ఉదారత.. ఉక్రెయిన్‌లోని సెక్యూరిటీ గార్డుకు ఆర్థిక సాయం