ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై జట్టుతో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ కాలికి తీవ్రంగా గాయమైన విషయం తెలిసిందే. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ తర్వాత బ్యాటింగ్ కూడా చేయలేదు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అతడికి విశ్రాంతి అవసరమని వైద్యబృందం సూచించింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యాడు.
ఆ తర్వాత న్యూజిలాండ్ చేరుకున్న కేన్‌కు అక్కడి డాక్టర్లు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. అతడి కుడి మోకాలి లిగ్మెంట్‌లో చీలిక పడిందని.. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. వచ్చే మూడు వారాల్లో అతడికి సర్జరీ జరగనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
అయితే ఐపీఎల్ మధ్యలో వైదొలిగిన కేన్‌కు పూర్తి జీతం అందుతుందా లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంది. అతడు లీగ్‌లో భాగంగా మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయపడ్డాడు కాబట్టి.. అతడికి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ మొత్తం వేతనాన్ని అందించనుంది. వేలంలో ఒప్పందం చేసుకున్న రూ. 2 కోట్లను కేన్ మామ పొందనున్నాడు.
- ఐపీఎల్‌లో ఆటగాళ్లు సంతకం చేసిన ఒప్పందాల ప్రకారం.. ఒక ఆటగాడు ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడు గాయపడి టోర్నమెంట్‌కు దూరమైతే అతడు పూర్తి వేతనాన్ని అందుకుంటాడు. టోర్నమెంట్ వరకు వైద్య ఖర్చులను కూడా ఫ్రాంచైజీ భరిస్తుంది.
- టోర్నమెంట్ ప్రారంభమయ్యే ముందు ఒక ఆటగాడు గాయపడి టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే.. ఫ్రాంచైజీ అతడికి ఎటువంటి మొత్తాన్ని చెల్లించదు.
- లీగ్‌లోకి గాయంతోనే వచ్చి.. కొన్ని మ్యాచ్‌లు ఆడినా.. ఫ్రాంచైజీ మొత్తం సొమ్మును చెల్లిస్తుంది.
- తమ జాతీయ జట్లకు సంబంధించి షెడ్యూల్ కారణంగా లీగ్‌కు దూరమైతే.. కేవలం ఆడే మ్యాచ్‌లకు మాత్రమే వేతనాన్ని చెల్లిస్తుంది ఫ్రాంఛైజీ.
- ఒక ఆటగాడు మొత్తం సీజన్‌లో అందుబాటులో ఉండి.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా అతడికి ఫ్రాంఛైజీ మొత్తం వేతనాన్ని చెల్లిస్తుంది.
2023 ప్రపంచకప్‌లో కేన్ విలియమ్సన్ ఆడతాడా?
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరిగే ప్రపంచకప్ టోర్నీకి అతడు అందుబాటులో ఉండే అవకాశాలు కన్పించట్లేదు. దీనిపై న్యూజిలాండ్ కోచ్ గేరీ స్టీడ్ మాట్లాడాడు. "ప్రపంచకప్ ప్రారంభమయ్యేలోపు విలియమ్సన్ మళ్లీ ఫిట్‌గా మారడం చాలా కష్టమే. అయితే మేం నమ్మకాన్ని వీడట్లేదు. అతడు త్వరగా కోలుకుని మైదానంలోకి రావాలనుకుంటున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థతి కన్పించట్లేదు" అని తెలిపాడు. మరోవైపు, గాయంపై కేన్ కూడా స్పందించాడు. "ఇలాంటి గాయాలు తీవ్ర నిరాశను కలిగిస్తాయి. అయితే సర్జరీ తర్వాత వేగంగా కోలుకోవడంపైనే నేను దృష్టిపెట్టాను. వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను" అని చెప్పాడు.
కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ!
న్యూజిలాండ్ కెప్టెన్ అయిన కేన్.. ఆ జట్టులో అగ్రశ్రేణి బ్యాటర్. 2019 ప్రపంచకప్‌లో ఆ జట్టును సెమీస్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతోపాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఆ ప్రపంచకప్ టోర్నీలో త్రుటిలో కప్పును చేజార్చుకున్న కివీస్‌కు.. ఇప్పుడు కేన్ దూరమవ్వడం గట్టి ఎదురుదెబ్బే!