ఆస్ట్రేలియా క్రికెట్లో పెను ప్రకంపనలు రేపిన బాల్ టాంపరింగ్ ఉదంతం చోటు చేసుకుని మూడేళ్లు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ ఉదంతంపై చర్చకు తెరలేపాడు బాన్‌క్రాఫ్ట్. అలాగే ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన రీతిలో దర్యాప్తు చేపట్టలేదని విమర్శించాడు డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కైన్. ఆటగాళ్లందరినీ విచారించకుండా ఆసీస్ బోర్డు ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. ఈ వివాదం కారణంగా శిక్ష అనుభవించిన డేవిడ్ వార్నర్ దానిపై ఓ పుస్తకం రాస్తే బాగుంటుందని అతడు తెలిపాడు.
"బాల్ టాంపరింగ్ వివాదంపై డేవిడ్ వార్నర్ ఏజెంట్ చేసిన వ్యాఖ్యలు విన్నా. ఆస్ట్రేలియా జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ దీనిపై ఓ పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఈ వివాదం ముగిసిపోయిందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావించింది. కానీ శిక్ష పడిన ఆ ముగ్గురు ఆటగాళ్లకు దీని నుంచి బయటపడటం చాలా కష్టం."