ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించాయి అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు. డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్, శ్రీలంక జట్లకు మాత్రం ఈ అవకాశం దక్కలేదు. ఇరు జట్లు క్వాలిఫయింగ్ రౌండ్లో ఆడి అర్హత సాధిస్తేనే టోర్నీలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్ 2021లో విన్నర్, రన్నరప్‌గా నిలిచిన రెండు టీమ్‌లతో సహా ఐసీసీ టీ20 ర్యాక్సింగ్స్‌లో టాప్ 8 జట్లు వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. అయితే.. ఇంగ్లాండ్, పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు టాప్ 6 స్థానాల్లో ఉన్నాయి.
శనివారం(నవంబర్ 6) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలైన వెస్టిండీస్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి పడిపోయింది. శ్రీలంక 9వ స్థానంలో ఉంది.
ఈ టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ అన్ని మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది ఆరంభంలో తమ సొంత గడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను ఓడించడమే ఇందుకు కారణం.