ఆఫ్‌స్పిన్నర్ బౌలింగ్‌కి వస్తే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు చిన్న వణుకు వస్తుంది. ఆ కంగారు పీక్స్‌లోకి వెళ్లాలంటే ఆ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయి ఉండాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్లను అలా కంగారు పెడతాడు మరి. ఇప్పుడు ఆస్ట్రేలియా భయం కూడా అదే. అసలే స్పిన్ పిచ్‌ల పై కంగారూలు తడబడతారనే అపవాదు ఉంది. అందులోనూ ఆ జట్టులో కీలకమైన లెఫ్టీలు ముగ్గురు ఉన్నారు. వీటికితోడు గతంలో ఆసీస్ మీద అశ్విన్ వికెట్ల వేట మామూలుగా సాగలేదు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో అశ్విన్ 18 టెస్టు మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. అందులో ఐదు వికెట్ల ఫీట్ 5 సార్లు, పది వికెట్ల ఫీట్ ఒకసారి ఉంది.
మన దగ్గర 50+స్వదేశంలో అశ్విన్ 50 వికెట్లు తీయగా.. ఆసీస్ గడ్డ మీద 39 వికెట్లు పడగొట్టాడు. ఈ లెక్కలు చూశాక ఆసీస్ భయపడటంలో తప్పేమీ లేదు అనిపిస్తోంది కదా. అశ్విన్ స్టాట్స్‌లోకి ఇంకాస్త డీప్‌గా వెళ్తే లెక్క ఇంకా బాగా అర్థమవుతుంది. అశ్విన్ కనుక ఎక్కువ వికెట్లు తీస్తే.. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌కు పరాజయం పక్కా లేదంటే డ్రా అయినా అవుతుంది. భారత్ గెలిచిన టెస్టుల్లో అశ్విన్ 52 వికెట్లు తీయగా, డ్రా అయిన మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అంటే 89లో 66 అన్నమాట. 2013లో జరిగిన బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో ఏకంగా 29 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
వార్నర్‌ను ఆటాడుకుని..బ్యాటర్ల వారీగా చూస్తే.. డేవిడ్ వార్నర్‌ను అశ్విన్ 10 సార్లు (15 మ్యాచ్‌ల్లో) ఔట్ చేశాడు. స్మిత్‌ను 6 సార్లు (12 మ్యాచ్‌ల్లో), లబుషేన్‌ను రెండుసార్లు (3 మ్యాచ్‌ల్లో), ఉస్మాన్ ఖవాజాను రెండుసార్లు (ఒక మ్యాచ్‌లో) పెవిలియన్‌కు పంపించాడు. ఇప్పుడు ఈ నలుగురూ ఆ జట్టుకు కీలక ఆటగాళ్లు అనే విషయం తెలిసిందే. అశ్విన్ పడగొట్టిన 89 వికెట్లలో 52 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లవే. పై నలుగురులో ఇద్దరు లెఫ్టీలు కావడం గమనార్హం. ఇదంతా చదివాక అశ్విన్ డూప్‌తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ఆ జట్టుకు ఎంత అవసరమో అర్థమవుతుంది.