అప్పట్లో క్రికెటర్లు తలకు ఎలాంటి రక్షణ లేకుండానే బ్యాటింగ్ చేసేవారు. కానీ కొంతకాలంగా బ్యాట్స్మెన్ హెల్మెట్ ధరించడమనేది తప్పనిసరి అయిపోయింది. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్మెన్ ఫిలిప్ హ్యూస్(phillip hughes) తలకు బంతి తగిలి మరణించిన తర్వాత ఈ రూల్ మరింత కఠినంగా మారింది. అయితే బ్యాట్స్మెన్.. స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో హెల్మెట్ వాడే విషయంలో మినహాయింపు ఉంది. ఈ సందర్భంలో వారు సాధారణ క్యాప్తోనూ బ్యాటింగ్ చేయొచ్చు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (england cricket board twitter) మాత్రం ఇందుకోసం విభిన్న రూల్స్ పాటిస్తోంది.
ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ (IndvsEng) మధ్య జరుగుతోన్న టెస్టు సిరీస్లో భాగంగా టీమ్ఇండియా బ్యాట్స్మెన్..స్పిన్ బౌలింగ్లో తలకు క్యాప్ ధరించి బ్యాటింగ్ చేయడం చూస్తున్నాం. కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మాత్రం హెల్మెట్తోనే బ్యాటింగ్ చేస్తున్నారు. దీనిపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారు? క్యాప్ ధరించొచ్చు కదా? అనే సందేహాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంగ్లీష్ స్పోర్ట్స్ జర్నలిస్టు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.