ఐపీఎల్-2023 వేలం ప్రారంభమైందంటే చాలు.. అందరి దృష్టి ఆమె పైనే. ఎంతో చలాకీగా ఉంటూ జట్టు సభ్యులను ఎంపిక చేసుకోవడంలో మేనేజ్‌మెంట్ సలహాలు తీసుకుంటూ వేలం జరుగుతున్నంత సేపూ చాలా హుషారుగా ఉంటారు. ఆమే..కావ్య మారన్. ఈసారి కేరళలోని కోచిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలోనూ ఈమె పాల్గొన్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యరీ బ్రూక్‌ను 13.25 కోట్లకు దక్కించుకున్నారు. దేశీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేశారు. తాజా ఐపీఎల్ వేలంతో మరోసారి ఆమె పేరు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీసింది.
ఎవరీ కావ్య మారన్?
సన్‌నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరీ మారన్ దంపతుల ఏకైక కుమార్తె కావ్య మారన్. 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించారు. అందరూ ముద్దుగా కావ్య అని పిలుచుకుంటారు. వ్యాపారంపై ఆసక్తితో ఎంబీఏ చదివారు. ఏవియేషన్, మీడియాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం సన్‌నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తండ్రి కళానిధి మారన్ 1990లో చిన్న మ్యాగజైన్‌తో తన వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచలుగా ఎదిగారు. తాజాగా రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్’ చిత్రానికి కళానిధి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రాజకీయంగానూ పలుకుబడి!
కావ్య మారన్ కుటుంబానికి కేవలం బిజినెస్ మాత్రమే కాకుండా రాజకీయంగానూ మంచి పలుకుబడి ఉంది. కావ్య వాళ్ల తాత మురసోలి మారన్ డీఎంకే పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా పని చేశారు. బాబాయ్ దయానిది మారన్ గతంలో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి..కావ్య వాళ్ల తాతయ్యకు స్వయానా మామయ్య. సన్ గ్రూప్‌లో జెమినీతోపాటు అనేక భాషల్లో పలు ఛానళ్లు ఉన్నాయి. సన్‌డైరెక్ట్ డీటీహెచ్ కూడా ఈ గ్రూప్‌నకు చెందిందే. సన్‌డైరెక్ట్ కి రెడ్ ఎఫ్‌ఎంతోపాటు ఇండియా మొత్తం..70 రేడియో స్టేషన్లు ఉన్నాయి.
విలియమ్సన్‌ను కాదని మయాంక్‌కు!
గతంలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్న న్యూజిల్యాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను ఈసారి ఎంపిక చేసుకోలేదు. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫామ్‌లో లేనందువల్లే విలియమ్సన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో రూ.14 కోట్లకు విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. హైదరాబాద్ తరఫున 76 మ్యాచ్‌లు ఆడి..2101 పరుగులు చేశాడు.
తాజాగా వేలంలో విలియమ్సన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 2కోట్లకు కొనుగోలు చేసింది. పక్కా వ్యూహంతోనే విలియమ్సన్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను హైదరాబాద్ జట్టు ఎంపిక చేసుకున్నట్లు విశ్లేషకుల అంచనా. ఐపీఎల్-2022లో కేవలం 13 మ్యాచ్‌లు ఆడిన మయాంక్ 196 పరుగులే చేసినప్పటికీ.. పంజాబ్ జట్టును ఆరో స్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు హైదరాబాద్ జట్టు సారథిగా మయాంక్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.