భారత క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్. తమ ఆటతోనే కాకుండా వ్యక్తిత్వాలతోనూ విశేషమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు భారత జట్టుకు సారథ్యం వహించిన ఈ త్రిమూర్తులు.. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నారంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. అలాంటి ముగ్గురూ ఒకే టెస్టులో అది కూడా ఒకే ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై శతకాలు బాదితే ఎలా ఉంటుంది? క్రికెట్ ప్రేమికులకు ఊహించుకోడానికే కనులపండుగ కదా! అది జరిగి సరిగ్గా 19 ఏళ్లు పూర్తయ్యాయి. అది కూడా ఇంగ్లాండ్ జట్టుపైనే. వచ్చే వారం కోహ్లీసేన తలపడే మూడో టెస్టు జరిగే లీడ్స్ మైదానంలోనే. ఈ సందర్భంగా నాటి విశేషాల్ని ఒకసారి నెమరువేసుకుందాం.
కెరీర్‌లో ఒకే ఒక్కసారి..
గంగూలీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా 2002లో నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 170 పరుగులతో గెలవగా రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. అందుకు ముఖ్య కారణం సచిన్, గంగూలీ, ద్రవిడ్ శతకాలు బాదడమే. ఈ ముగ్గురూ కలిసి ఒకేసారి తమ కెరీర్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు కొట్టారు. నాసర్ హుస్సేన్ నేతృత్వంలోని ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ లీడ్స్ మైదానాన్ని చప్పట్లతో హోరెత్తించారు. దాంతో యావత్ భారత క్రికెట్ అభిమానులు ఆనందంలో మునిగితేలారు. అలాగే ఆ టెస్టును టీమ్‌ఇండియా చరిత్రలో ఒక చిరస్మరణీయ మ్యాచ్‌గా నిలిపారు.
ఒకరుపోతే మరొకరు..
ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే వీరేంద్ర సెహ్వాగ్ (8) విఫలమైనా మరో ఓపెనర్ సంజయ్ బంగర్ (68; 236 బంతుల్లో 10x4)తో కలిసి వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్ (148; 307 బంతుల్లో 23x4) రెండో వికెట్‌కు 170 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. బంగర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ (193; 330 బంతుల్లో 19x4, 3x6) త్రుటిలో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. ద్రవిడ్‌తో కలిసి మూడో వికెట్‌కు 150 పరుగులు జోడించాడు. జట్టు స్కోర్ 335 పరుగుల వద్ద మిస్టర్ డిపెండబుల్ ఔటయ్యాక, కెప్టెన్ గంగూలీ (128; 167 బంతుల్లో 14x4, 3x6) అడుగుపెట్టాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 249 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించారు. అలా ఈ ముగ్గురి శతకాలతో టీమ్‌ఇండియా చివరికి 628/8 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
బౌలర్లు సమష్టిగా రాణించి..
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 273 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రాబర్ట్ కీ (30; 76 బంతుల్లో 6x4), మైకేల్ వాన్ (61;116 బంతుల్లో 9x4) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించి గట్టి పునాదులు వేసినా.. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయారు. అనిల్ కుంబ్లే, హర్భజన్ మూడేసి వికెట్లతో చెలరేగగా, జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ చెరో రెండు వికెట్లతో ఇంగ్లాండ్ పనిపట్టారు. మధ్యలో అలెస్ స్టీవార్ట్ (78 నాటౌట్; 120 బంతుల్లో 11x4) పోరాడినా టెయిలెండర్లు కూడా వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆపై ఫాలోఆన్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు ఈసారి 309 పరుగులు చేయగలిగింది. కుంబ్లే 4, సంజయ్ బంగర్ 2 వికెట్లు తీయగా, జహీర్, అగార్కర్, హర్భజన్ తలో వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో నాసిర్ హుస్సేన్ (110; 194 బంతుల్లో 18x4, 1x6) శతకంతో మెరిసినా ఇతర బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. అలా టీమ్‌ఇండియా చివరికి ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం నాలుగో టెస్టు డ్రాగా ముగియడం వల్ల 1-1తో ఆ సిరీస్ సమమైంది.