నిలకడైన ప్రదర్శనలతో టీమ్ఇండియా బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకగా మారాడు ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma). తనదైన బ్యాటింగ్‌తో అభిమానుల్లో 'హిట్‌మ్యాన్'గా పేరు సంపాదించాడు. పవర్ హిట్టింగ్, ఫుల్‌షాట్లు, క్రీజులో ఎక్కువసేపు ఉండగల సామర్థ్యం.. ఇవన్నీ రోహిత్‌ను అభిమానుల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్ బ్యాటింగ్ స్థిరత్వం వెనక ప్రస్తుత టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) పాత్ర ఉందని మీకు తెలుసా!
2013కు ముందు రోహిత్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. నిలకడలేమితో ఒకానొక సమయంలో జట్టులో చోటే ప్రశ్నార్ధకమైంది. కోహ్లీ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చినప్పటికీ అతడిలా పరుగులు సాధించడానికి హిట్‌మ్యాన్ ఇబ్బందిపడేవాడు. ఈ విషయాన్ని గమనించిన నాటి సారథి ధోనీ.. రోహిత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేశాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇలా పరిమిత ఓవర్ల సిరీస్‌లో రోహిత్ ఓపెనర్‌గా (Rohit Sharma) విజయవంతమయ్యాడు. కానీ, టెస్టుల్లో మిడిలార్డర్లోనే బ్యాటింగ్‌కు దిగేవాడు. 2019లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్. ఆ తర్వాత ఒకే నెలలో మూడు సెంచరీలు బాది తానెంత విలువైన ఆటగాడినో చాటిచెప్పాడు.