సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదు. కానీ తాజాగా దాదా చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అతడు రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమే అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎందుకుంటే అతడు తాజాగా క్రికెట్ వర్గాలకు ఊహించని షాకిచ్చాడు. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరమైన అతడు.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నాడు. దీని గురించి మాట్లాడుతూ.. 'ఈ ఎన్నికల గురించి భవిష్యత్‌లో ఆలోచిస్తాను. నా కొత్త ఇన్నింగ్స్‌లో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి' అని అన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. బహుశ దాదా రాజకీయాల్లోకి వచ్చే విషయం గురించే పరోక్షంగా అన్నాడని భావిస్తున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం కూడా తన క్రీడా ప్రస్థానం ప్రారంభించి 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా దాదా ఓ ట్వీట్ చేశాడు. 'ప్రజలకు సహాయపడేలా ఇకపై ఏదైనా చేయాలని భావిస్తున్నా. కొత్త మార్గంలో నడవాలని ప్లాన్ చేసుకుంటున్నా. నాకు మీ అందరి మద్దతు కావాలి' అంటూ రాసుకొచ్చాడు. ఆ ట్వీట్ రాజకీయ ఎంట్రీకి సంబంధించిందేనని వార్తలు గుప్పుమన్నాయి. ఇకపోతే ఆ ట్వీట్‌కు కొద్ది రోజుల క్రితం కూడా భాజపాకు చెందిన కీలక నేతలు గంగూలీ ఇంటికి వెళ్లి మంతనాలు జరపడం.. మరోవైపు బంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలతో అతడు టచ్‌లో ఉన్నాడని వార్తలు రావడం జరిగింది.