వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో విండీస్ ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ సిమన్స్ తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది అఖరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ అనంతరం సిమన్స్ తన బాధ్యతలు నుంచి తప్పుకోనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు కూడా ప్రకటించింది.
"వెస్టిండీస్ అనేది కేవలం ఒక జట్టు మాత్రమే కాదు. కొన్ని దేశాల కలయిక. టీ20 ప్రపంచకప్‌లో మా జట్టు ప్రదర్శన అభిమానులకు నిరాశ కలిగించింది. మేము ఈ టోర్నీలో మా స్థాయికి తగ్గట్టు రాణించలేదు. ఇందుకు కరీబియన్ అభిమానులకు, మద్దతుదారులకు క్షమాపణలు కోరుతున్నాను. ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ అనంతరం వెస్టిండీస్ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను స్వయంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఆస్ట్రేలియా గడ్డపై మా జట్టు టెస్టు సిరీస్ కైవసం చేసుకునేలా నేను ప్రయత్నిస్తాను" అని సిమన్స్ పేర్కొన్నాడు. కాగా 2016లో టీ20 ప్రపంచకప్‌ను విండీస్ కైవసం చేసుకోవడంలో సిమన్స్ కీలక పాత్ర పోషించాడు.