Double Century In T20 Rakheem Cornwall: టీ20ల్లో అర్ధశతకం చేస్తే గొప్ప.. ఇక సెంచరీ మార్క్‌ను తాకితే అద్భుతం.. ఇలాంటి పొట్టి ఫార్మాట్‌లో ఏకంగా ఓ బ్యాటర్ డబుల్ సెంచరీ బాదేశాడు. మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్‌లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించడం గమనార్హం. ఇంతకీ ఆ వీరభయంకర ప్లేయర్ ఎవరంటారా..? వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రకీం కార్నెల్.. ఇలా పేరు చెబితే పెద్దగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే అతడు తన జాతీయ జట్టు తరఫున ఆడిందే కేవలం తొమ్మిది టెస్టులు మాత్రమే. కానీ 'విండీస్ బాహుబలి' అనగానే.. భారీ కాయంతో ఉండే రకీం కార్నెల్ తప్పకుండా గుర్తుకొస్తాడు.
అయితే విండీస్ తరఫున ఆడుతూ రకీం కార్నెల్ ఇలా వీరవిహారం చేయలేదు. అమెరికా వేదికగా టీ20 టోర్నమెంట్ అట్లాంటా ఓపెన్‌లో అట్లాంటా ఫైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చెలరేగాడు. కేవలం 77 బంతుల్లో 266.23 స్ట్రైక్‌రేట్‌తో 205 పరుగులను బాదేశాడు. అందులో 22 సిక్స్‌లు, 17 ఫోర్లు ఉండటం గమనార్హం. దీంతో స్క్వేర్ డ్రైవ్ జట్టుపై అట్లాంటా ఫైర్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది. ప్రముఖ గణాంక నిపుణుడు మోహన్‌దాస్ మేనన్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.