పిచ్ పరిస్థితులను బట్టి అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్(Gary Stead news) అన్నాడు. టెస్టు మ్యాచులు జరుగనున్న కాన్పుర్, వాంఖడే మైదానాలు వేటికవే ప్రత్యేకమైనవని పేర్కొన్నాడు. నవంబరు 25 (గురువారం) నుంచి న్యూజిలాండ్, భారత్(IND vs NZ Test Series) జట్ల మధ్య కాన్పుర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీతో.. అజింక్యా రహానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
"ఇంతకు ముందు భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు ఎందుకు విఫలమయ్యాయో మేం పరిశీలించాం. అవే తప్పులను మేం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగితే ఇక్కడి పిచ్‌లపై ప్రభావం చూపలేం. ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. మిగతా మ్యాచుల్లో అదే సూత్రాన్ని అనుసరిస్తామని చెప్పడం సరికాదు. పిచ్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడూ వ్యూహాలను మారుస్తూనే ఉండాలి. టెస్టు క్రికెట్లోని కొన్ని మూల సూత్రాలను పాటిస్తూనే.. మా ఆట తీరులో మార్పులు చేసుకుంటాం."