టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన తర్వాత టీమ్ఇండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా భారత పేసర్ మహ్మద్ షమీపై కొందరు నెటిజన్లు(Shami abuse on social media) విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. షమీ ప్రదర్శనకు అతని మతాన్ని జోడిస్తూ సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్నారు. అతని దేశభక్తిని కించపరిచేలా పరుష పదజాలంతో ఆన్లైన్లో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనికి మద్దతుగా నిలిచారు పలువురు మాజీలు, రాజకీయ నేతలు. ఈ క్రమంలోనే భారత్ క్రికెట్ అభిమానులు కూడా షమీకి(Mohammed Shami news) అండగా నిలుస్తున్నారు. షమీకి భారత్ పట్ల ఉన్న దేశభక్తిని చాటేలా ఉన్న వీడియోను ఓ అభిమాని పోస్ట్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో భారత జట్టు ఆటగాళ్లను దూషించిన పాక్ అభిమానికి షమీ వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది. దీనిపై స్పందించిన అభిమానులు 'షమీ నిజమైన భారతీయుడు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లండన్‌లో 2017జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమి తర్వాత భారత ఆటగాళ్లను ఓ పాక్ అభిమాని విమర్శించగా.. షమీ తిప్పికొట్టాడు. అప్పుడే దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా.. ఓ పాక్ అభిమాని 'బాప్ కౌన్ హే' అంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. అందరు ఆటగాళ్లు వెళ్లిపోతున్నా.. ముందుకు వెళ్లిపోయిన షమీ.. వెనక్కి వచ్చి మరి ఇది సరి కాదంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని జోక్యం చేసుకుని షమీని సముదాయించాడు.