Wasim Jaffer Sad Over Odi Team : బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన టీమ్‌ఇండియా.. చివరి వన్డేలో మాత్రం చెలరేగింది. ఈ మ్యాచ్‌తో కింగ్ కోహ్లీ 72వ అంతర్జాతీయ శతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ వన్డేల్లో తన తొలి ద్విశతకాన్ని సాధించాడు. దీంతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేట్టుగానే కనపడుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మరో యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'శుభ్‌మన్ గిల్ పరిస్థితి చూస్తే బాధేస్తోంది' - శుభ్‌మన్‌గిల్ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ ప్రదర్శన చేస్తున్నప్పటికీ శుభ్‌మన్‌గిల్‌కు సరైన అవకాశాలు రావట్లేదు. తాజాగా శుభ్‌మన్‌గిల్‌పై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే..?
"ఇటీవల మ్యాచ్‌లో తన ప్రదర్శనతో శుభ్‌మన్‌గిల్ కన్నా ఇషాన్ ఉత్తమ ఎంపికగా మారాడు. గిల్ విషయంలో నాకు కాస్త బాధగా ఉంది. ఎందుకంటే, ఈ ఇన్నింగ్స్‌కు ముందు ఓపెనర్ల లిస్టులో అతడు ముందు వరుసలో ఉన్నాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తర్వాత వరుసగా మూడో స్థానంలో ఉన్నవాడు.. ఇషాన్ ఎంట్రీతో నాలుగో స్థానంలోకి పడిపోయాడు. అతడి తప్పేమీ లేకపోయినా గిల్‌కు జట్టులో స్థానం దక్కకపోవడం బాధగా అనిపిస్తుంటుంది" అని జాఫర్ పేర్కొన్నాడు.
ధావన్ ఫామ్ గురించి మాట్లాడుతూ.. "న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. కొంత కాలంగా ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం, కొందరు మధ్యలోనే నిష్క్రమించడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ధావన్ ఫామ్ కోల్పోతే టీమ్‌మేనేజ్‌మెంట్‌ను మరింత అయోమయానికి గురిచేస్తుంది. ఇటీవల పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ అతడు మరోసారి సత్తా చాటాలని సెలక్టర్లు భావిస్తుండవచ్చు. ఏదేమైనా నంబర్ 3, 4 స్థానాల్లో ఆడే ఓపెనర్లు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది" అంటూ జాఫర్ వివరించాడు.