Jaffer Counter:టీమ్ఇండియా మాజీ బ్యాటర్ వసీమ్ జాఫర్ సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో ఫన్నీ మీమ్స్ పోస్టులు చేస్తుంటాడు. ఇక ఎవరైనా ఏదైనా పోస్టులు పెడితే వాటికి తగ్గట్టుగా స్పందించడంలోనూ ఈ దేశవాళీ బ్యాటింగ్ దిగ్గజం అందరికన్నా ముందుంటాడు. తాజాగా ఓ ఆస్ట్రేలియన్ వెబ్‌సైట్‌కు కూడా జాఫర్ అలాంటి చురకలే అంటించి వార్తల్లో నిలిచాడు.
కోహ్లీపై వ్యంగ్యాస్త్రాలు.. ఓ వెబ్‌సైట్‌కు జాఫర్ కౌంటర్ - వసీం జాఫర్ ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టర్ కౌంటర్
Jaffer Counter: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్‌కు కౌంటర్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. కోహ్లీ రెండేళ్ల ప్రదర్శనపై ఓ వెబ్‌సైట్ ట్వీట్ చేయగా.. అదే రీతిలో వారికి స్మిత్ సగటు గురించి ట్వీట్ చేసి గట్టి బదులిచ్చాడు జాఫర్.
టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ రెండేళ్లుగా స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. 2019 నవంబర్‌లో కోల్‌కతా వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో బంగ్లాదేశ్‌పై చివరిసారి శతకం బాదాడు. ఇక అప్పటి నుంచి విరాట్ ఇప్పటివరకూ మరో మూడంకెల స్కోర్ నమోదు చేయలేదు. దీంతో అతడి బ్యాటింగ్ సగటు కూడా ఈ మధ్య తగ్గింది. ఈ క్రమంలోనే '7Cricket' అనే ఓ ఆస్ట్రేలియన్ వెబ్‌సైట్.. తాజాగా కోహ్లీ బ్యాటింగ్ సగటును ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పోల్చింది. 'స్టాట్ ఆఫ్ ది డే' అని పేర్కొంటూ.. 2019 నుంచి టెస్టుల్లో స్టార్క్ సగటు 38.63, కోహ్లీ సగటు 37.17 ఉన్నాయని వారి ఫొటోలతో సహా ఓ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన జాఫర్ తనదైన శైలిలోనే నవ్వుతున్న ఎమోజీ జత చేసి మరింత దీటుగా జవాబిచ్చాడు. టీమ్‌ఇండియా యువ పేసర్ నవ్‌దీప్ సైని (53.50) వన్డే కెరీర్ బ్యాటింగ్ సగటు.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్‌స్మిత్ (43.34) కన్నా మెరుగ్గా ఉందంటూ రీట్వీట్ చేశాడు. దీనికి భారత అభిమానులు తెగ నవ్వుకుంటూ లైకులు, షేర్లు చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్ వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. అయితే, మూడో టెస్టుకు ముందు అతడు తిరిగి నెట్స్‌లో సాధన చేయడం వల్ల ఆ మ్యాచ్‌కల్లా ఫిట్‌నెస్ సాధిస్తాడని హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. "మూడో టెస్టు వరకూ అన్ని రకాలుగా కోహ్లీ సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నా. కసరత్తులు చేసుకోవడానికి అతడికి తగినంత సమయం దొరికింది. కేప్‌టౌన్‌లో నెట్ సెషన్స్ ద్వారా అతడు తిరిగి లయ అందుకుంటాడు. అతడితో మాట్లాడాక చివరి టెస్టుకు అందుబాటులో ఉంటాడనిపిస్తోంది" అని ద్రవిడ్ తాజాగా మీడియాతో అన్నాడు.