టీ20 ప్రపంచకప్-2021లో సెమీ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టి నిరాశపర్చింది టీమ్ఇండియా. దీంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు బీసీసీఐ విధానాలను తప్పుబట్టారు. మరికొందరు జట్టు ప్రణాళికపై మండిపడ్డారు. వచ్చే ఏడాది జరిగే మెగాటోర్నీ కోసమైనా సరైన వ్యూహాలు రచించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియాకు ఓ మంచి సూచన ఇచ్చాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్.
అప్పట్లో టీమ్ఇండియా పసుపు రంగు జెర్సీ ధరించి కొన్ని మ్యాచ్‌లు ఆడింది. దీనికి సంబంధించి సచిన్ ఎల్లో జెర్సీ ధరించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన జాఫర్.. "ప్రస్తుతం పసుపు రంగు జెర్సీ ధరించిన జట్టు ట్రోఫీలు గెలుస్తోంది. అందువల్ల ఎల్లో జెర్సీని తిరిగి తీసుకురావాల్సిన సమయం వచ్చింది" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనిని చూసిన నెటిజన్లు.. జాఫర్ ట్వీట్‌పై విపరీతంగా కామెంట్లు పెడుతూ నవ్వుకుంటున్నారు. మరికొందరు 'నిజమే కదా!' అంటూ కామెంట్ చేస్తున్నారు.