నాలుగో ఫ్రాంఛైజీకి ఆడుతున్నందుకు తనపై ఒత్తిడి ఉందని మాక్స్‌వెల్ అంటున్నాడు. జట్టులో తనకు ప్రత్యేక పాత్ర ఇచ్చారని తెలిపాడు. పరుగులు చేయడం తమకు ఇబ్బందైనప్పుడు ప్రత్యర్థికీ కష్టమేనని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. వరుస ఓటములను జీర్ణించుకోలేక పోతున్నామని డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 143/9కే పరిమితమైంది.
ఇక్కడా ఆసీస్ పాత్రే..!
(మాక్స్‌వెల్: 59; 41 బంతుల్లో 5×4, 3×6)
మా ఆరంభాలు చాలా బాగున్నాయి. ఇది నా కొత్త ఫ్రాంచైజీ. వారు నాకు ప్రత్యేక పాత్ర ఇచ్చారు. మన తర్వాత బ్యాటింగ్ చేసేవాళ్లుంటే స్వేచ్ఛగా ఆడగలుగుతాం. నా తర్వాత ఏబీ ఉండటంతో స్వేచ్ఛగా ఆడాను. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని పాత్రే ఇక్కడా పోషిస్తున్నాను. జట్టు యాజమాన్యం, సహాయ సిబ్బంది, ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు. అనుభవంతో పరుగులు చేశాను. మొదటి బంతి నుంచే బాదుతూ చివరి వరకు తీసుకెళ్లడం నాకు అలవాటు లేని పని. ఇది నా నాలుగో ఐపీఎల్ జట్టు కాబట్టి ఒత్తిడి ఉంటుంది. నేను మరింత మెరుగ్గా ఆడేందుకు అదే కారణమవుతోంది. వాషింగ్టన్ సుందర్ మా జట్టులో సూపర్‌స్టార్. నేను బౌలింగ్ ఎక్కువగా చేయకపోతే బ్యాటుతో మరిన్ని పరుగులు చేయగలను.
వాళ్లకూ కష్టమేగా..
(విరాట్ కోహ్లీ: 33; 29 బంతుల్లో 4×4)
మేం అలసిపోలేదు. జట్టును చూసి గర్విస్తున్నా. వికెట్ సవాల్ విసిరింది. ముంబయి మ్యాచులోనూ ఇలాగే జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆఖరి వరకు పోరాడాలి. మాకు ఎక్కువ బౌలింగ్ వనరులు ఉన్నాయి. దాంతో మధ్య ఓవర్లలో ప్రభావం చూపించాం. 150 పరుగుల లక్ష్యం కాపాడుకోవచ్చన్న విశ్వాసం నాకుంది. ఇన్ని పరుగులు చేయడం మనకు కష్టమైనప్పుడు అవతలి వాళ్లకూ అంతే కదా. వికెట్లు పోతున్నప్పుడు ఒత్తిడిలో ఛేదన సవాలే. ఎందుకంటే మ్యాచు ఎటువైపైనా మొగ్గు చూపొచ్చు. పాత బంతిని ఎదుర్కోవడం కఠినంగా అనిపించింది. పవర్‌ప్లేలో కొన్ని బౌండరీలు బాది జోరు కొనసాగించాలని భావించా. మాక్సీ ఇన్నింగ్సే తేడా. మేం సాధిస్తున్న విజయాలకు పొంగిపోవడం లేదు. మా ప్రణాళికల్లో స్పష్టత ఉంది. ఒక్కో మ్యాచును లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నాం.
పిచ్ సహకారం