Virat Kohli: తనకు తాను కాస్త వ్యవధిని ఇచ్చుకొని, పనిభారాన్ని చూసుకునేందుకే ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. 2021 సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథిగా తప్పుకొంటానని గతేడాది సెప్టెంబర్లోనే ప్రకటించాడు విరాట్. అంతకుముందే టీమ్ఇండియా టీ20 పగ్గాలు వదిలేసుకున్న కోహ్లీని.. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం టెస్టు సారథిగానూ విరాట్ తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలోనే నాయకుడిగా వైదొలగడంపై 'ది ఆర్సీబీ పాడ్కాస్ట్'లో మాట్లాడాడు.
"చేయాల్సిన వాటికన్నా ఎక్కువ విషయాలను అట్టిపెట్టుకునే వ్యక్తిని కాదు. నేను ఇంకా చేయగలనని తెలిసినా.. ఆ పనిని ఆస్వాదించలేకపోతే ఎప్పటికీ చేయను. నా స్థానంలో ఉంటే తప్ప ప్రజలు ఇలాంటి కఠిన నిర్ణయాలను అర్థం చేసుకోలేరు. ఈ నిర్ణయంలో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. పనిభారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి నాకు సమయం కావాలి. అంతే!"
- విరాట్ కోహ్లీ, ఆర్సీబీ మాజీ కెప్టెన్
నా జీవితం చాలా సింపుల్..
కెప్టెన్సీ వీడ్కోలు నిర్ణయంపై ప్రజల్లో వచ్చిన అనేక ఊహాగానాలకు కోహ్లీ తెరదించాడు. "ఈ నిర్ణయంపై అంతగా ఆలోచించడానికి ఏమీ లేదు. నా జీవితాన్ని సింపుల్గా పెట్టుకుంటా. నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు.. తీసేసుకున్నా. ప్రకటించా. దీనిని మరో ఏడాది పొడిగించడం వల్ల ఎవరికీ ఏ ఉపయోగమూ లేదు. నా వరకు జీవితమైనా, క్రికెట్ అయినా నాణ్యతే ముఖ్యం. ఎంతకాలం అనేది అనవసరం" అని చెప్పాడు విరాట్.