టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik pandya) పూర్తిస్థాయిలో బౌలింగ్ ఎప్పుడెప్పుడు చేస్తాడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. శ్రీలంక పర్యటనకు ఎంపికైన నేపథ్యంలో శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హార్దిక్ ఈ విషయమై స్పందించాడు. టీ20 ప్రపంచకప్(T20 Worldcup) నాటికి పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించి బంతులు విసురుతానని చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టంతా ఈ మెగా ఈవెంట్‌పైనే ఉందని, అందుకోసం శ్రమిస్తున్నట్లు తెలిపాడు.
"టీ20 ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తాను. స్మార్ట్‌గా వర్క్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. కచ్చితంగా బంతులు విసురుతానని భావిస్తున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా ఈ మెగాఈవెంట్ పైనే. నా సర్జరీ తర్వాత కూడా నేనెప్పుడు బౌలింగ్ కసరత్తు మానలేదు. నా బౌలింగ్.. ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఎంత బలంగా తయారవుతే అంత ఎక్కువ ఫలితం ఇవ్వగలను. నేనెప్పుడూ 50శాతం సామర్థ్యంతో ఆడాలనుకోలేదు. 100శాతం సామర్థ్యంలో బరిలో దిగుతా" అని పాండ్య వివరించాడు.