VVS Laxman Comments on Mayank Agarwal: భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. రెండో టెస్టులో 150, 62 పరుగులతో జట్టు విజయంలో కీలకంగా మారాడు. దీనిపై టీమ్ఇండియా దిగ్గజం, నేషనల్ క్రికెట్ అకాడమీకి కాబోయే అధ్యక్షుడు వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడాడు. మయాంక్ ఆత్మవిశ్వాసానికి చాలా ప్రధాన్యత ఇచ్చాడని అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా ఛానల్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు లక్ష్మణ్.
"ఆత్మవిశ్వాసానికి మయాంక్ చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మెరుగైన ప్రదర్శనతో అతడేంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్, అంతర్జాతీయ క్రికెట్లో ఆడే విధంగానే టెస్టులోనూ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఇది చాలా మంచి విషయం."
--వీవీఎస్ లక్ష్మణ్, మాజీ క్రికెటర్.
స్పిన్నర్లు సత్తాచాటిన మైదానంలోనూ మయాంక్ మంచి షాట్లు ఆడటం మెచ్చుకోదగిన విషయమని లక్ష్మణ్ అన్నాడు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనూ కళ్లుచెదిరే షాట్లు కొట్టాడని గుర్తుచేశాడు. కైల్ జేమిసన్, టిమ్ సౌథీ వ్యూహాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని ప్రశంసించాడు.