Virat vs Babar ODI Record :2023 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇరుజట్ల సమరానికి మరో 24 గంటల సమయం మాత్రమే ఉండడం వల్ల.. క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పుడు ఇండోపాక్ మ్యాచ్ జరిగిన ఇరుజట్లలోని స్టార్ ఆటగాళ్ల మధ్య పోటీ చర్చకు వస్తుంది. గతంలో సచిన్ తెందూల్కర్ వర్సెస్ షోయబ్ అక్తర్ అని.. తర్వాత గౌతమ్ గంభీర్ వర్సెస్ షాహీద్ ఆఫ్రిది అంటూ సమజ్జీవుల సమరాన్ని ఎంజాయ్ చేసేవారు. ఇక ఈ లిస్ట్‌లోకి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-బాబర్ అజామ్ చేరిపోయారు.
బ్యాటింగ్‌లో వీరిద్దరూ పోటీ పడి మరీ పరుగులు సాధిస్తూ పలు రికార్డులు నెలకొల్పుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకే రకమైన లక్షణాలు, పోలికలూ ఉన్నాయి. విరాట్, బాబర్ ఇద్దరు కూడా టాప్ ఆర్డర్ బ్యాటర్లే. వారివారి జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన వారే. ఇక విరాట్ ఇప్పటికే అనేక రికార్డులు కొల్లగొట్టి క్రికెట్లో కింగ్‌గా పేరొందగా.. తన కంటే జూనియర్ అయినప్పటికీ బాబర్ కూడా సత్త చాటుతూ ప్రస్తుతం నంబర్.1 వన్డే బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
అయితే అక్టోబర్ 14 శనివారం రోజు జరిగే భారత్-పాక్ మ్యాచ్‌లో అందరి ఫోకస్ వీరిద్దరిపైనే ఉండనుంది. అనుభవం పరంగా విరాట్‌కు ఇది నాలుగో (2011, 2015, 2019, 2023) వరల్డ్ కప్ కాగా.. బాబర్‌కి (2019, 2023) రెండోది. ఈ క్రమంలో ప్రపంచ కప్ టోర్నీలో ఇద్దరి గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే..
- విరాట్ కోహ్లీ
విరాట్ ఇప్పటిదాకా వరల్డ్‌కప్ నాలుగు ఎడిషన్లలో కలిపి 27 ఇన్సింగ్స్ ఆడాడు. ఇందులో విరాట్ 2 శతకాలు, 7 అర్ధ శతకాలు సహా.. 1115 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 107 కాగా, యావరేజ్ 48.48.. స్ట్రైక్ రేట్ 85.51 గా ఉంది. ఇక ఫీల్డ్‌లోనూ చురుగ్గా ఉండే విరాట్ ఇప్పటివరకు16 క్యాచులు అందుకున్నాడు. - బాబర్ అజామ్
రెండు ఎడిషన్లలో కలిపి బాబర్.. 9 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు సహా.. 479 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లో 101* పరుగులు అతడి టాప్ స్కోర్. ఇక స్ట్రైక్ రేట్ 86.00 కాగా, యావరేజ్ 59.88 గా ఉంది. మొత్తం 5 క్యాచులు అందుకున్నాడు. కానీ వీరిద్దరూ ఇప్పటిదాకా కూడా డకౌట్ అవ్వకపోవడం విశేషం.