Virat Kohli World Cup Records : వన్డే ప్రపంచ కప్‌లో భారత్ సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది తమ సత్తా చాటుతోంది. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన తమ ఖాతాలో పలు రికార్డులు వేసుకుంది. ముఖ్యంగా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని చూపించాడు. అటు బ్యాట్‌తో పాటు ఇటు బాల్‌తోనూ చెలరేగిపోయాడు. రోహిత్ ఔటయ్యాక.. కీలక ఇన్నింగ్స్‌లో మైదానంలో దిగిన కింగ్ కోహ్లీ ఫోర్లు, సిక్స్‌లను అలవోకగా ఆడి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆటను ఓ సూపర్ సిక్సర్‌తో ముగించాడు. అలా 97 బంతుల్లో శతకం బాది.. సచిన్ రికార్డుకు చేరువయ్యాడు. ఇదే కాకుండా మరిన్ని ఘనతలను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటంటే..
- ఇప్పటికే సచిన్ (49) వన్డే సెంచరీల రికార్డుకు చేరువగా వచ్చిన కోహ్లీ (48).. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో మూడో శతకాన్ని చేశాడు. అలాగే ఛేజింగ్‌లో ఇదే తొలి వరల్డ్ కప్ సెంచరీ కావడం విశేషం. అతడి కంటే ముందు రోహిత్ శర్మ (7) టాప్‌లో ఉండగా.. సచిన్ ఆరు, సౌరభ్ గంగూలీ నాలుగు, శిఖర్ ధావన్ మూడు సెంచరీలు చేశారు.
- ఈ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనెను అధిగమించి కోహ్లీ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ తెందూల్కర్ (34,357 పరుగులు), కుమార సంగక్కర (28,016 పరుగులు), రికీ పాంటింగ్ (27,483 పరుగులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు కోహ్లీ (26,026 పరుగులు) నాలుగో స్థానంలో, జయవర్ధనె (25,957 పరుగులు) ఐదో స్థానంలో ఉన్నారు.
- ప్రపంచకప్‌లో మూడు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ.. అందులో రెండు బంగ్లాదేశ్‌పైనే చేయడం గమనార్హం. ఇలా ఒకే జట్టుపై రెండు సెంచరీలు చేసిన నాలుగో బ్యాటర్‌గా విరాట్ చరిత్రకెక్కాడు. అయితే విరాట్ కంటే ముందు.. కెన్యాపై సచిన్, కెన్యాపై గంగూలీ, బంగ్లాదేశ్‌పై రోహిత్ రెండేసి శతకాలను బాదారు.
- ఒకే వేదికపై 500+ పరుగులు చేయడం విరాట్‌కు ఇది ఐదోసారి. పుణె వేదికగా ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 94.34 స్ట్రైక్‌రేట్‌తో 551 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో 800, శ్రీలంకలోని కొలొంబోలో 644, విశాఖపట్నం పిచ్‌పై 587, ట్రినిడాడ్‌లో 571 పరుగులు చేశాడు.
- ఆరేళ్ల తర్వాత విరాట్ తొలిసారి వన్డేల్లో బౌలింగ్ చేశాడు. చివరిగా 2017 ఆగస్ట్ 31న శ్రీలంకపై రెండు ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చాడు. ఇక 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా ఒక ఓవర్ వేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో విరాట్ కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. అదే వరల్డ్ కప్‌లో ఆసీస్‌పై ఒక ఓవర్ వేసి 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత 2015 ప్రపంచకప్‌లో ఆసీస్‌పైనే ఒక ఓవర్ బౌలింగ్ చేసి 7 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు మూడు బంతుల్లో కేవలం 2 పరుగులతో ఓవర్‌ను ముగించాడు.