Virat Kohli World Cup 2023 : ఓ పరిపూర్ణమైన బ్యాటర్ కావడంపై దృష్టి పెట్టడం కంటే కొత్త షాట్లు నేర్చుకోవడం మేలని అంటున్నాడు టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. న్యూజిలాండ్‌తో దాదాపుగా ఖాయమైన సెమీఫైనల్ పోరు కోసం సిద్ధమౌతున్న నేపథ్యంలో కోహ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.
"టెక్నిక్, స్కిల్‌ను మెరుగుపరుచుకోవడంలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి నేర్చుకున్న టెక్నిక్ మ్యాచ్‌లు గెలవడానికి ఉపయోగించడం.. లేకుంటే బ్యాటింగ్ మెరుగుపరచుకోవడం. బ్యాటింగ్‌లో మెరుగుపడటం అనే విషయం గురించి చాలామందికి అవగాహన ఉండదు. మన బ్యాటింగ్‌కు ఇంకా ఏం చేరిస్తే గెలుపు కోసం కృషి చేయచ్చు అని ఆలోచిస్తే మన ఆట మెరుగవుతుంది. ఈ క్రమంలో పరిపూర్ణమైన బ్యాటర్ కావడంపై ఫోకస్ చేయడం కంటే కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిదని నా అభిప్రాయం. దీని వల్ల పరుగులు వస్తాయి.. జట్టు గెలుస్తుంది" అని విరాట్ పేర్కొన్నాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ నేరుగా కొట్టిన సిక్సర్‌ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. "రవూఫ్ బౌలింగ్‌లో కొట్టిన ఆ సిక్సర్‌ను చాలాసార్లు చూశాను. ఎంతో ప్రత్యేకమైన సమయం అది. ఈ రోజు వరకు ఆ షాట్ ఎలా ఆడానో నాకే తెలియదు" అని కోహ్లి పేర్కొన్నాడు.