Kohli BCCI: వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ స్పందించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ చెప్పిన దానికి.. విరాట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదని అన్నాడు. టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్సీపై వస్తున్న వదంతులపై స్పష్టత రావాలంటే.. వారిద్దరూ కలిసి మీడియా ముందుకు రావాలని సూచించాడు.
"బీసీసీఐని ఈ వివాదంలోకి లాగాలని కోహ్లీ భావించి ఉండకపోవచ్చు. కానీ, వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. ఎక్కడ తప్పు జరిగిందో వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరించాలి. వన్డే కెప్టెన్సీ మార్పునకు సంబంధించిన కారణాలను వివరిస్తూ.. సెలెక్షన్ కమిటీ పత్రికా ప్రకటన ఇచ్చినా సరిపోతుంది. అప్పుడే అనవసర ఊహాగానాలను కట్టడి చేయగలం"
-సునీల్ గావస్కర్, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
మరోవైపు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చింది. వన్డే ఫార్మాట్ నాయకత్వ మార్పునకు సంబంధించి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ ముందుగానే కోహ్లీతో చర్చించాడని పేర్కొంది.