Virat Kohli Test Captaincy: పండగ వేళ.. క్రికెట్ అభిమానులకు షాక్! అలసిపోయాడో, ఇక చాలనుకున్నాడో, భారం వల్ల పరుగుల వేటలో వెనుకపడ్డాననుకున్నాడో, మారిన పరిస్థితుల ఫలితమో.. ఓ గొప్ప అధ్యాయానికి ముగింపు పలుకుతూ, ఓ స్ఫూర్తిదాయక ప్రస్థానానికి స్వస్తి చెబుతూ.. టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ అకస్మికంగా గుడ్‌బై చెప్పేశాడు. కోహ్లీ సారథిగా లేని జట్టును ఊహించడం కష్టమే! అంకితభావంతో అందరి మనసులు గెలిచి, తనదైన దూకుడుతో జట్టులో ఉత్తేజం నింపి, తగ్గేదేలే అనే తత్వంతో ప్రత్యర్థులను ఢీకొట్టి.. సారథి అంటేనే తాను అనేలా ముద్ర వేసిన అగ్గిబరాటా విరాట్ ఇక ఓ ప్లేయర్ మాత్రమే.
కచ్చితంగా క్రికెట్ మునుపటిలా ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో కలలు నెరవేరాయి అతడి సారథ్యంలో.. ఎన్నో అపురూప విజయాలు దక్కాయి అతడి నాయకత్వంలో, ఎంతో పోరాటతత్వం అలవడింది అతడి కెప్టెన్సీలో..! భారత క్రికెట్లో సారథిగా అతడిదో స్పెషల్ ఇన్నింగ్స్. లోతుల్లోకి వెళ్తే.. అబ్బురపరిచే ఘట్టాలెన్నో!
సుదీర్ఘ ఫార్మాట్లో జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి విరాట్ కోహ్లీ అంకిత భావం, తపన, ఆటపై ఆయనకు ఉన్న ప్రేమే కారణమంటూ బీసీసీఐ కితాబిచ్చింది. అత్యంత విజయవంతమైన కెప్టెన్ కోహ్లీ టెస్టు పగ్గాలు కూడా వదిలేసిన సందర్భంలో ఆయన సేవలను కొనియాడింది. ప్రపంచవ్యాప్తంగా తాజా, మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసిస్తున్నారు. 68 టెస్టుల్లో టీమ్‌ఇండియాను నడిపించిన విరాట్.. జట్టుకు 40 విజయాలు అందించాడు. అతని సారథ్యంలో 17 మ్యాచ్‌ల్లో ఓడిన జట్టు.. 11 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది.
"కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు విదేశాల్లో గెలవడమనేది గొప్ప ఘనతగా ఉండేది. ఇప్పుడు భారత్ విదేశాల్లో ఓడిపోవడం బాధాకరంగా మారింది. కోహ్లీ భారత క్రికెట్‌ను అంత ఉన్నత స్థితికి తీసుకెళ్లాడు. అది అతడి వారసత్వం".. కోహ్లీ బాధ్యతల నుంచి తప్పుకున్న వేళ టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ వ్యాఖ్యలివి. విరాట్ గొప్పతనం గురించి ఇంతకన్నా ఎవరూ గొప్పగా చెప్పలేరేమో. కోహ్లీ వివాదాస్పదుడే కావొచ్చు, అతి దూకుడు వల్ల విమర్శలు ఎదుర్కొని ఉండొచ్చు, అతడి నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తి ఉండొచ్చు.. కానీ విజయ కాంక్షతో రగిలిపోయే అతడి గురించి జాఫర్ అభిప్రాయంతో విభేదించే వాళ్లెవరూ బహుశా ఉండకవపోవచ్చేమో!
శిఖరానికి చేర్చాడు..:అధికారికంగా 2015లో మొదలైంది కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్! టెస్టులకు ధోనీ అకస్మికంగా వీడ్కోలు పలకడం వల్ల కోహ్లీ బాధ్యతలు అందుకున్నాడు. ఆ తర్వాత అంతా విజయపరంపరే. బలహీన పర్యటక జట్టుగా పేరున్న భారత్‌ను తన నాయకత్వంలో బలమైన పర్యటక జట్టుగా మార్చాడు. తన దూకుడు, పట్టుదలతో విదేశాల్లోనూ విజయాలు సాధ్యమేనన్న నమ్మకాన్ని సహచరుల్లో కలిగించిన కోహ్లీ జట్టును సమున్నత శిఖరాలకు చేర్చాడు. చిన్న, పెద్దా.. జూనియర్, సీనియర్ అన్న భేదాలు లేకుండా జట్టును ఒక్కతాటిపై నడిపించాడు. తన వైఖరి వల్ల తాను విమర్శలపాలయ్యాడేమో కానీ.. జట్టుకు మాత్రమే లాభమే చేకూర్చాడు. విజయాల్లోనూ, వైఫల్యాల్లోనూ తన ఆటగాళ్లను ఎప్పుడూ వెనకేసుకొచ్చాడు కోహ్లీ. ఈ క్రమంలో విమర్శలపాలైనా అతడు లెక్కచేయలేదు. ఎదురుదెబ్బలు తగిలినా తన తీరును మార్చుకోలేదు. అందుకే అత్యంత విజయవంతమైన భారత కెప్టెనయ్యాడు. 68 టెస్టుల్లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించిన అతడు.. 40 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. సారథిగా కేవలం 17 టెస్టుల్లో ఓడిపోయాడు. అంకెల్లోనూ, శాతాల్లోనూ అతడు అత్యంత విజయవంతమైన భారత టెస్టు సారథి. కోహ్లీ నాయకత్వంలోనే టీమ్‌ఇండియా.. నంబర్‌వన్ టెస్టు ర్యాంకును తిరిగి చేజిక్కించుకుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సొంతగడ్డపై విజయాలతోనే భారత్ అగ్రస్థానానికి చేరి ఉంటే దానికి ఎలాంటి ప్రత్యేకతా ఉండేది కాదు. కానీ జట్టు ఇంటా బయటా అదగొట్టింది. దశాబ్దాల కలను నెరవేర్చుకుంటూ కోహ్లీ సారథ్యంలోనే .. ఆస్ట్రేలియా గడ్డపై మొట్టమొదటిసారి సిరీస్ (2-1) విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో సిరీస్‌లో 2-1 (ఇంకోటి ఆడాల్సివుంది)తో పైచేయి సాధించింది. గతంలో భారత్ ఎన్నో తంటాలు పడ్డ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో (సేనా దేశాలు).. కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా 23 టెస్టుల్లో ఏడు నెగ్గడం (13 ఓటములు, 3 డ్రా) అతడి నాయకత్వ ప్రతిభను, జట్టులో అతడు రగిల్చిన స్ఫూర్తిని చాటుతాయి.
అలా నడిపించాడు..:ధోనీ లాంటి మేటి కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలిక కాదు. కానీ ఎంతో చురుకైన కోహ్లీ చాలా త్వరగానే దమ్మున్న కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. జట్టుపై తనదైన ముద్ర వేశాడు. కానీ విజయాలు అతడికి ఊరికే ఏమీ రాలేదు. జట్టు దృక్పథంలో మార్పు తేవడానికి అప్పుడు అతడి వద్ద మంత్ర దండమేమీ లేదు. సేనా దేశాల్లో విజయవంతం కావాలంటే ఏం చేయాలన్నది అతడు గుర్తించాడు. నాణ్యమైన పేసర్లే కాదు, మంచి వేగంతో ఎక్కువసేపు బౌలింగ్ చేయగల ఫిట్ పేసర్లు కావాలని గ్రహించాడు. అందుకే జట్టులో ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రవేశపెట్టాడు. ఆ విషయంలో తానే ముందుండి చాలా మంది ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌పై వ్యామోహం కలిగేలా చేశాడు. దేశవాళీ ఆటగాళ్లూ అతణ్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో భారత్ రెండు సార్లు ఓడించిందంటే కారణం కోహ్లీ పేస్ విభాగంపై ప్రధానంగా దృష్టిపెట్టడమేననడంలో ఎలాంటి సందేహం లేదు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న పేసర్ బుమ్రా త్వరగా టెస్టు అరంగేట్రం చేయడంలో కోహ్లీది కీలక పాత్రే. సిరాజ్‌ను తీర్చిదిద్దిన ఘనత కూడా అతడిదే. వీళ్లతో పాటు షమీ, ఉమేశ్, ఇషాంత్‌లకు అతడిచ్చిన ప్రోత్సాహం వెలకట్టలేనిది. అలాగే.. ఓపెనర్‌గా అవతారమెత్తడం ద్వారా రోహిత్ టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదగడం వెనకా విరాట్ ఉన్నాడు. కెప్టెన్‌గా అతడెప్పుడూ రాజీపడలేదు. జట్టు ప్రయోజనాల కోసం అనుకున్నప్పుడు.. సెలక్షన్ కమిటీ నుంచి తాను అనుకున్నది రాబట్టాడు.
బ్యాటుతో అదరహో...: గత రెండేళ్లలో ఇబ్బందిపడ్డాడేమో కానీ.. కెప్టెన్సీతో కోహ్లీలోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్ బయటికొచ్చాడు. వ్యూహ రచనతోనే కాదు.. పరుగుల వేటలోనూ కోహ్లీ జట్టును ముందుండి నడిపించాడు. తన ఏడు టెస్టు డబుల్ సెంచరీలనూ కెప్టెన్‌గానే సాధించాడు. 27 సెంచరీల్లో 20 సారథిగానే కొట్టాడు. 2019 వరకు కోహ్లీ బ్యాటింగ్ పెద్ద సంచలనం. పరుగుల వరద పారిస్తూ, శతకాల మీద శతకాలు బాదేస్తూ మేటి టెస్టు బ్యాట్స్‌మన్‌గా ఎందరో దిగ్గజాల ప్రశంసలు పొందాడు. మొత్తంగా.. కోహ్లీ సారథిగా 54.80 సగటుతో 5,864 పరుగులు సాధించాడు. ఇంకా అతడిలో చాలా క్రికెట్టుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్న కోహ్లీ.. మళ్లీ పూర్వంలా రెచ్చిపోవాలని ఆశిద్దాం!
దూకుడుతో మొదలెట్టి..
2014 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టుతో తన కెప్టెన్సీ ప్రస్థానాన్ని మొదలెట్టిన విరాట్.. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలతో జట్టు విజయం కోసం పోరాడాడు. 364 పరుగుల ఛేదనలో భారత్ ఓ దశలో 277/4తో గెలిచేలా కనిపించింది. కానీ స్పిన్నర్ లైయన్ దెబ్బకు 48 పరుగుల తేడాతో ఓడింది.
22 ఏళ్ల తర్వాత..
శ్రీలంక గడ్డపై రెండు దశాబ్దాలకు పైగా ఊరించిన టెస్టు సిరీస్ విజయాన్ని కోహ్లీసేన 2015లో అందుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడినా కసితో రగిలిపోయిన టీమ్‌ఇండియా తర్వాతి రెండు టెస్టుల్లో అద్భుత విజయాలతో సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది.
ఆ చరిత్ర..
2018-19లో తొలిసారి ఆస్ట్రేలియాలో భారత్‌కు సిరీస్ విజయం దక్కింది. కోహ్లీ సారథ్యంలోని జట్టు 2-1తో గెలిచింది. గొప్ప పోరాట పటిమ ప్రదర్శించిన భారత్ తొలి మ్యాచ్‌లో నెగ్గింది. కానీ రెండో టెస్టులో గెలిచిన ఆసీస్ సిరీస్ సమం చేసింది. మూడో మ్యాచ్‌లో నెగ్గి.. ఆ తర్వాత మ్యాచ్‌ను డ్రా చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఆధిపత్యం..
స్వింగ్, బౌన్స్‌కు సహకరించే పేస్ పిచ్‌లుండే ఇంగ్లాండ్‌లో గతేడాది కోహ్లీసేన అదరగొట్టింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయిస్తూ అయిదు టెస్టుల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ముగిసే సరికి 2-1తో ఆధిక్యంలో నిలిచి సిరీస్ విజయానికి బాటలు వేసుకుంది. కరోనా కారణంగా చివరి టెస్టు వాయిదా పడింది.
తొలి ఫైనల్..