టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకిచ్చిన విలువైన సలహాల గురించి వెల్లడించాడు టెస్ట్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్. బ్యాటింగ్‌కు దిగినప్పుడు నిర్భయంగా, స్పష్టమైన మనస్తత్వంతో ఆడాలని కోహ్లీ చెప్పినట్లు తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడంపైనా మాట్లాడాడు గిల్.
"ఆట ప్రణాళికల్లో భాగంగా కోహ్లీ భాయ్‌తో మాట్లాడినప్పుడు నిర్భయంగా ఆడాలని నాకు అతడు సూచించాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు స్పష్టమైన మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పాడు. అందుకు సంబంధించి అతడి అనుభవాలను నాతో పంచుకున్నాడు. ఇక రోహిత్ భాయ్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తున్నప్పుడు బౌలర్లు బంతులెక్కడ వేస్తున్నారనే విషయంపై ఎక్కువ చర్చించుకుంటాం. పరిస్థితి ఎలా ఉందనే దాన్ని బట్టి మా షాట్ల ఎంపిక ఉంటుంది."
-శుభ్‌మన్ గిల్, టీమ్ఇండియా యువ ఓపెనర్.
ఇదీ చదవండి:రైల్వే విధుల నుంచి రెజ్లర్ సుశీల్ సస్పెండ్!
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన గిల్.. ఆ సిరీస్‌లో నిలకడైన ఆట తీరును ప్రదర్శించాడు. నాలుగు టెస్టుల్లో 2 అర్ధ సెంచరీల సాయంతో 259 పరుగులు చేశాడు. కానీ, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అంతగా రాణించలేదు. 7 ఇన్నింగ్స్‌ల్లో 119 రన్స్ మాత్రమే సాధించాడు. ఇక ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌కు ఎంపికైన గిల్.. ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవాలి..
"ఆసీస్‌లో మేము మెరుగ్గా ఆడాం. విదేశాల్లో టీమ్ఇండియా బాగానే ఆడుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మా సన్నద్ధత సరిపోలేదని అనుకుంటున్నాను. ఇంగ్లాండ్ పర్యటనలో ప్రతి సెషన్‌కు మెరుగ్గా ఆడడం ముఖ్యం. ఇక్కడ మాత్రమే కాదు.. విదేశీ పిచ్‌లపై ప్రతి సెషన్‌ను చూసుకొని ఆడాలి. సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంగ్లాండ్‌లో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు పిచ్ బంతి స్వింగ్ అవుతుంది. అదే సూర్యరశ్మి పడగానే బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితుల పట్ల అవగాహన రావడం చాలా అవసరం" అని గిల్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:కొవిడ్ బాధితుల కోసం మరోసారి పాండ్య సోదరులు