Virat Kohli: విరాట్ కోహ్లీ, ధోనీ నాయకత్వ శైలీ గురించి వివరించాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్. కోహ్లీ.. 'సూపర్‌హ్యూమన్' అని అన్నాడు. ఐపీఎల్లో విరాట్ సారథ్యంలో ఆర్సీబీకి, మహీ కెప్టెన్సీలో సీఎస్కేకేకు ఆడాడు షేన్‌వాట్సన్.
"కోహ్లీ.. నాయకుడిగా ఎన్నో అసారధారణమైన పనులు చేశాడు. ఆటగాళ్లను ఎంతో ప్రోత్సాహిస్తాడు. తన చుట్టూ ఉన్న ప్లేయర్స్‌ను ఎలా ఆడించాలో, వారికి ఎలా మద్దతు ఇవ్వాలో అతడికి బాగా తెలుసు. కోహ్లీకి తనపై తనకు భారీ అంచనాలుంటాయి. ప్రతి గేమ్‌లోనూ వాటిని అందుకునేందుకు కృషి చేస్తాడు. విరాట్ ఓ సూపర్‌హ్యూమన్. అతడి వ్యక్తిత్వం చాలా మంచిది. అతడితో పనిచేయడం ఓ గొప్ప అనుభూతి."
-షేన్ వాట్సన్, మాజీ క్రికెటర్
ధోనీలో మంచు ప్రవహిస్తుంది..
"ధోనీ నరాల్లోనే ఐస్ ప్రవహిస్తూ ఉంటుంది. ఒత్తిడిని తీసుకోగలడు. ప్లేయర్స్‌పై నమ్మకం ఉంచుతాడు. ప్రతి ఆటగాడు తమ సామర్థ్యాలపై ఆత్మవిశ్వాసం ఉంచేలా చేస్తాడు. చుట్టూ ఉన్నవాళ్ల కోసం ఏం చేయాలి, తన కోసం తానేమీ చేయాలో అతడికి బాగా తెలుసు. మైదానంలో తన నైపుణ్యంపై నమ్మకం ఉంచుతాడు. అలానే ఆటగాళ్లపైనా ఉంచుతాడు. తద్వారా వాళ్లు మైదానంలో పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో నేర్చుకుంటారు." అని వాట్సన్ అన్నాడు.
సహజమైన నాయకుడు.. రోహిత్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపైనా ప్రశంసలు కురిపించాడు వాట్సన్. అతడో గొప్ప సారథి అని చెప్పాడు. "రోహిత్లో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ముంబయి ఇండియన్స్‌కు అతడు సారథ్యం వహించే విధానాన్ని చాలా దగ్గరగా చూశాను. వృత్తి పట్ల నిబద్ధతగా ఉంటాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ముంబయి ఇండియన్స్ లాంటి జట్టును బాగా నడిపించాడు. అతడు గొప్ప బ్యాటర్. అతడి ఆటను చూడాటానికి బాగా ఇష్టపడతాను." అని వాట్సన్ తెలిపాడు.
ఇదీ చూడండి:'నువ్వు సూపర్‌స్టార్'.. కోహ్లీకి యూవీ స్పెషల్ గిఫ్ట్