Virat Kohli: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ- మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కమిటీ ఆఫ్ అడ్మనిస్ట్రేటర్స్కు (సీఓఏ) అధ్యక్షుడిగా పనిచేసిన వినోద్ రాయ్.. ఈ అంశం గురించి తన పుస్తకం 'నాట్ జస్ట్ ఏ నైట్‌వాచ్‌మెన్'లో ప్రస్తావించారు. కుంబ్లే వ్యవహారశైలితో యువ ఆటగాళ్లు బెదిరిపోయారని కోహ్లీ తనతో చెప్పినట్లు వినోద్ అందులో పేర్కొన్నారు.
టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా లెజెండరీ స్పిన్నర్ ఉన్న సమయంలో అతడి విధానాలతో కోహ్లీ సంతృప్తిగా లేడని సమాచారం. క్రికెట్ అడ్వైజరీ కమిటీలో ఉన్న దిగ్గజాలు సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్.. కుంబ్లే-విరాట్ మధ్య సయోధ్య కుదిరించాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దీంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత.. హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకొన్నాడు కుంబ్లే.
"కెప్టెన్ (కోహ్లీ), టీమ్‌మేనేజ్‌మెంట్‌తో మాట్లాడినప్పుడు.. కుంబ్లే చాలా క్రమశిక్షణాపరుడని అర్ధమైంది. దీంతో ఆటగాళ్లు అతడితో సంతృప్తిగా లేరని తెలిసింది. విరాట్‌తో మాట్లాడినప్పుడు.. యువ క్రికెటర్లు కుంబ్లే శైలితో భయపడుతున్నారని చెప్పాడు."
-వినోద్ రాయ్, సీఓఏ మాజీ అధ్యక్షుడు