Virat Kohli Rohit Sharma T20 selection :టీ20 ఫార్మాట్లో ఎంపిక కోసం తాము అందుబాటులో ఉన్నామని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్‌తో టీ20, టెస్ట్ సిరీస్‌ల కోసం జట్టును ఎంపిక చేయడానికి శుక్రవారం సెలక్షన్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ప్లేయర్లు బోర్డుకు తెలియజేసినట్లు సమాచారం. అయితే 2022 టీ20 వరల్డ్ కప్‌లో చివరగా ఆడిన ఈ ప్లేయర్లు, అప్పటినుంచి పొట్టి ఫార్మాట్లో మ్యాచ్‌లు ఆడలేదు.
జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో టీమ్ఇండియా మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత సొంత గడ్డపై జనవరి 25 మొదలుకానున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అయితే టీ20 వరల్డ్ కప్‌నకు ముందు టీమ్ఇండియా ఆడనున్న చివరి 3 టీ20లకు, ఇంగ్లాండ్ సిరీస్‌లో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం జట్లను ఎంపిక చేయడానికి శుక్రవారం బీసీసీఐ సెలక్షన్ సమావేశం కానుంది.
ఇదిలా ఉండగా అఫ్గానిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి వారిని ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు జట్టులోకి తీసుకోవాలని, అప్పటివరకు వారు ఫుల్ ఫిట్‌గా ఉండాలని బోర్డు ఆశిస్తున్నట్లు సమచారం.
గురువారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది టీమ్ఇండియా. సఫారీలతో జరిగిన రెండు టెస్టుల్లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు రోజులలో ముగిసిన రెండో టెస్టులో ఇద్దరు ప్లేయర్లు వరుస వికెట్లు పడగొట్టి విశ్వరూపం చూపించారు.