Virat Kohli Ricky Ponting :ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ ఓ చిరస్మరణీయ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అదే వన్డే ఫార్మాట్లో తన 49వ సెంచరీ. అంతుకుముందు క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును విరాట్ సమం చేశాడు. అది కూడా తన 35వ పుట్టినరోజు నాడే ఈ మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా ఈసారి జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో తన రెండో సెంచరీని బాదాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో 49 శతకాలు సాధించిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పరుగుల వీరుడిని ప్రశంసిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 'విరాట్‌పై ఇప్పటి వరకు ఉన్న భారమంతా దిగిపోయింది. ఇక నుంచి కోహ్లీ మరింత స్వేచ్ఛగా ఆడతాడని నేను భావిస్తున్నాను' అని పాంటింగ్ పేర్కొన్నాడు.
"సచిన్ పేరిట ఉన్న సెంచరీల రికార్డును విరాట్ సమం చేశాడు. అందుకు అతడికి అభినందనలు. దీంతో విరాట్‌పై ఉన్న బరువంతా దిగిపోయింది. ఈ మైలురాయిని చేరుకునేందుకు తీవ్రంగా కష్టపడి ఉంటాడు. అది కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకమైన మెగా టోర్నీలో ఈ ఫీట్‌ను అందుకోవడం విశేషం. సెమీస్‌కు ముందు టీమ్ఇండియా లీగ్ స్టేజ్‌లో మరో మ్యాచ్ ఆడనుంది. అందులో కూడా విరాట్ శతకం బాదితే భారత క్రికెట్‌కు ఓ గొప్ప రోజుగా మిగిలిపోతుంది."
- రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ సారథి
'ఇకపోతే నాకౌట్ దశలో కోహ్లీ మరింత స్వేచ్ఛగా ఆడతాడు. ఇప్పటికే 'ఛేజింగ్ కింగ్' పేరును సొంతం చేసుకున్న విరాట్ ఆల్‌టైమ్ ప్లేయర్ల లిస్ట్‌లో ముందుంటాడు. అతడి ఆటతీరు అత్యుత్తమం. ఇదే మాటను నేను ఎప్పుడో చెప్పాను. అతడికేమీ సచిన్ రికార్డును సమం చేయాల్సిన అవసరం లేదు. అతడి బ్యాటింగ్ రికార్డులను పరిశీలిస్తే ఛేజింగ్‌లో అద్భుతంగా రాణించాడు. అందుకే అనుకుంటా సచిన్ 49 శతకాల రికార్డును సమం చేయడానికి కేవలం 277 ఇన్నింగ్స్‌లను మాత్రమే తీసుకున్నాడు' అని పాంటింగ్ విరాట్‌ను కొనియాడాడు.