Kohli Smile reaction getting out: ఏ బ్యాట్స్‌మన్ అయినా ఔటైనపుడు బాధగా, నిరాశగా ముఖం పెడతాడు. కానీ విరాట్ కోహ్లి మాత్రం ఈ సీజన్లో వరుసగా తక్కువ స్కోర్లకు వెనుదిరుగుతున్నపుడు నవ్వు ముఖం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సీజన్లో విరాట్ మూడుసార్లు గోల్డెన్ డక్ (తొలి బంతికే ఔట్) కావడం, ఆ సందర్భాల్లో అతను ఒక నవ్వు నవ్వి పెవిలియన్ చేరడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ స్పందనకు కారణమేంటో విరాట్ వెల్లడించాడు. "నా కెరీర్లో ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదు. అందుకే నేనలా నవ్వా. ఆట ఏమేం చూపిస్తుందో అవన్నీ నేను చూసేశానని అనిపించింది" అని కోహ్లి చెప్పాడు. తన పేలవ ఫామ్‌పై టీ20 లీగ్ వ్యాఖ్యాతల నుంచి వస్తున్న విమర్శల గురించి కూడా అతను స్పందించాడు. "విమర్శకులు నా స్థానంలో ఉండి ఆలోచించలేరు. నేనేమనుకుంటున్నానో వాళ్లు తెలుసుకోలేరు. విమర్శలకు ప్రభావితం కాకుండా ఉండడానికి రెండు దారులున్నాయి. ఒకటి టీవీ రిమోట్‌లో మ్యూట్ బటన్ నొక్కడం, లేదంటే ఎవరేమంటున్నారో పట్టించుకోకుండా ఉండిపోవడం. నేను ఈ రెండు పనులూ చేస్తా" అని విరాట్ అన్నాడు. మరోవైపు చాలా ఏళ్ల పాటు తనతో కలిసి బెంగళూరు జట్టుకు ఆడిన ఏబీ డివిలియర్స్ ఈ సీజన్ నుంచి ఐపీఎల్‌కు దూరం కావడంపై విరాట్ మాట్లాడాడు. వచ్చే ఏడాది అతడు బెంగళూరు జట్టులో కోచింగ్ స్టాఫ్‌గా చేరొచ్చనే సంకేతాలను కూడా ఇచ్చాడు. "ఏబీ లేని లోటు చాలా కనిపిస్తోంది. నేను అతడితో తరచుగా మాట్లాడుతుంటా. అతను అమెరికాలో కుటుంబంతో కలిసి గోల్ఫ్ చూస్తున్నాడు. అదే సమయంలో బెంగళూరు ప్రదర్శనను గమనిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏదో రకంగా జట్టులో అతను భాగమవుతాడని ఆశిస్తున్నా" అన్నాడు.
Kohli du plessis: టీ20 లీగ్‌లో చాలా కాలంపాటు చెన్నై జట్టుకి ఆడిన డుప్లెసిస్ ఈ ఏడాది బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతడి స్థానంలో డుప్లెసిస్‌ను నియమించింది బెంగళూరు జట్టు యాజమాన్యం. అతడి సారథ్యంలో బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. బ్యాటర్‌గా కూడా డుప్లెసిస్ మెరుగైన ఆటతీరును కనబరుస్తున్నాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 389 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే డుప్లెసిస్ కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ స్పందించాడు. డుప్లెసిస్ కెప్టెన్సీపై గౌరవం ఉందని, కొన్ని సార్లు తన సూచనలకు అతడు నో చెప్పేవాడని విరాట్ పేర్కొన్నాడు.