virat kohli odi captaincy news: ఇటీవలే టీ20 సారథ్యాన్ని వదులుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డే కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. అతణ్ని బాధ్యతల నుంచి తప్పించిన జాతీయ సెలక్షన్ కమిటీ టీ20 సారథి రోహిత్ శర్మను కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించింది. దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు వైస్ కెప్టెన్‌గా కూడా అతడికి బాధ్యతలు అప్పగించింది. ఆ పర్యటనలోనే రోహిత్ వన్డే సారథిగా తన ఇన్నింగ్స్ మొదలెడతాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు తుది జట్టులో స్థానం కోల్పోయినప్పుడే రహానె వైస్‌కెప్టెన్సీ పోవడం ఖాయమైపోయింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో అతడు, పుజారా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
రోహిత్‌ను టెస్టుల్లో ఉపసారథిగా నియమించడం సమీప భవిష్యత్తులో అతణ్ని అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా చూసే అవకాశముందనడానికి సూచిక. రహానె స్థానంలో అతడు టెస్టు ఉపసారథయ్యే అవకాశముందని ఇంతకుముందే వార్తలొచ్చాయి. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో టెస్టులో సెంచరీ మినహా గత రెండేళ్లుగా ప్రదర్శన పేలవంగా ఉన్న నేపథ్యంలో జట్టులో రహానె స్థానంపై ప్రశ్నలు తలెత్తాయి. 2021 సీజన్‌లో 12 టెస్టుల్లో అతడి సగటు 20 లోపే. ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టడానికి ముందు రహానెకు మరో అవకాశం ఇవ్వాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ భావించడం కూడా ప్రస్తుతానికి అతడి స్థానం నిలవడానికి ఓ కారణం. మెరుగైన ప్రదర్శన చేయకపోతే దక్షిణాఫ్రికా సిరీసే అతడికి చివరి అవకాశం కావొచ్చు.
రహానెకు అందుకే ఛాన్స్!
"పుజారా, కోహ్లీ కూడా చాలా కాలంగా పరుగులు చేయట్లేదు. రహానె తన స్థానం నిలబెట్టుకోవడానికి అది కూడా ఓ కారణమే. మరో ఇద్దరు కూడా విఫలమవుతున్నప్పుడు కేవలం ఒక్క ఆటగాడినే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమే అవుతుంది. రహానె, పుజారాలకు మాత్రం దక్షిణాఫ్రికా పర్యటనే చివరి అవకాశమనడంలో సందేహం లేదు" అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి అన్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు (డిసెంబరు 26, సెంచూరియన్)లో రహానె తుది జట్టులో ఉంటాడన్న గ్యారెంటీ లేదని చెప్పాడు. "వైస్ కెప్టెన్‌కు తుది జట్టులో స్థానం ఖాయం కానప్పుడు.. ఆ హోదాలో అతడు ఉండడం సమంజసం కాదు" అని ఆ అధికారి అన్నాడు. శుభ్‌మన్ గిల్ కాలి గాయం తిరగబెట్టడం కూడా రహానెకు మరో అవకాశం దక్కడానికి కారణమని భావిస్తున్నారు. పాజిటివ్ దృక్పథంతో ఆడే గిల్.. శ్రేయస్ అయ్యర్‌తో పాటు మిడిల్ ఆర్డర్‌లో బాగా ఉపయోగపడతాడన్న భావనతో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది.