సాధారణంగా పాఠ్య పుస్తకాల్లో.. ప్రసిద్ధి చెందిన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను పాఠ్యాంశంగా చెప్పడం చూస్తుంటాం. వీరికి సంబంధించిన ప్రశ్నలను.. విద్యార్థులు రాసే పరీక్షల్లో అడుగుతుండటం కూడా మనం చూస్తుంటాం. తాజాగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ కోహ్లీ గురించి.. ఓ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో అడిగారు. ఇప్పటికే గతంలో పలువురు టాప్ క్రికెటర్లపై ప్రశ్నలు అడిగిన విషయాన్ని చాలా మందికి తెలిసిన విషయమే. ఇక తాజాగా విరాట్ కూడా వారి సరసన చేరాడు. ఇంతకీ అతడి గురించి ఏం అడిగారంటే..
రికార్డుల రారాజు, ఫిట్నెస్ కా బాప్.. ఇలా ఎన్నో ముద్దుపేర్లతో కోహ్లీని పిలుచుకుంటుంటారు. ప్రపంచ క్రికెట్‌ను తన బ్యాట్‌తో శాసించిన విరాట్.. గత కొంత కాలం ఫామ్‌లో లేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. కెప్టెన్సీ కూడా పోగొట్టుకున్నాడు. జట్టులో స్థానాన్ని కూడా పోగొట్టుకుంటాడని అందరూ అనుకున్నారు. అలా దాదాపు మూడు సంవత్సరాల పాటు సెంచరీ చేయలేక కష్టాలు పడ్డాడు. అయితే ఈ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ.. అద్భుతమైన పునరాగమనం చేశాడు. గతేడాది జరిగిన ఆసియా కప్ నుంచి అద్భుతమైన ఫామ్‌లోకి తిరిగి వచ్చేశాడు. ఆసియాకప్-2022లో ఆఫ్గానిస్థాన్‌పై అద్భుతమైన శతకంతో తన పూర్వ వైభవాన్ని పొందాడు. అలా తన రిథమ్‌తో పాటు శతకం కోసం తన మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. అది అతడికి తన అంతర్జాతీయ కెరీర్‌లో 71వ శతకం కావడం విశేషం. మొత్తంగా టీ20, వన్డే, టెస్టుల్లో శతకాలు బాది మునుపటి ఫామ్‌లోకి వచ్చి.. ఎంతో మంది యంగ్ ప్లేయర్స్‌కు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.