Virat Kohli Press Conference: టీమ్ఇండియాలో గత వారం రోజులుగా ఆందోళనకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. వన్డే జట్టు సారథిగా కోహ్లీని తప్పించి రోహిత్‌కు బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. అనంతరం.. టీ20 సారథిగా తప్పుకోవద్దని చెప్పినా.. కోహ్లీ కెప్టెన్సీ వదిలేశాడని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఓ సందర్భంలో తెలిపాడు. ఈ పరిణామాల నడుమ రోహిత్ తొడకండరాల గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు హాజరుకాలేనని చెప్పడం, కోహ్లీ వన్డే సిరీస్‌కు దూరమవుతున్నట్లు వదంతులు రావడం వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో జట్టులో అసలేం జరుగుతుందో అభిమానులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
నాకు అసలు చెప్పనేలేదు..
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ.. రోహిత్‌కు తనకు ఎలాంటి వివాదం లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే.. టీ20 జట్టు కెప్టెన్సీ వదిలేయొద్దని తనకు ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశాడు. వన్డే జట్టు సారథి తొలగింపు విషయంలోనూ బీసీసీఐకి అతడికి సరైన చర్చలు జరగలేదని పేర్కొన్నాడు. కెప్టెన్సీ నిర్ణయానికి 90 నిమిషాల ముందు సెలెక్టర్లు తనకు ఫోన్ చేసి సమాచారం అందించారని చెప్పుకొచ్చాడు.
రిక్వెస్ట్ చేశా..
వన్డే కెప్టెన్‌గా కోహ్లీని తొలగించిన అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టీ20 కెప్టెన్సీ వదిలేయొద్దని విరాట్ కోహ్లీని వ్యక్తిగతంగా కోరాను. కానీ, ఒత్తిడి పెరుగుతుందని విరాట్ సారథిగా తప్పుకొంటున్నట్లు చెప్పాడు. ఇది సరైన నిర్ణయమే. విరాట్ ఓ మంచి ప్లేయర్. చాలా ఏళ్ల నుంచి సారథిగా అతడే ఉన్నాడు కాబట్టి కోహ్లీపై కాస్త ఒత్తిడి పెరిగింది.' అని గంగూలీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.