Kohli on leaving captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంత దూరం ప్రయాణిస్తానని ఎప్పుడూ అనుకోలేదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఎలాంటి అదనపు బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం దొరికిందని పేర్కొన్నాడు. ఇటీవల ట్రెయినింగ్ సెషన్‌లో పాల్గొన్న కోహ్లీ.. పలు విషయాలపై మాట్లాడాడు. ఆ వీడియోను ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
virat kohli on du plessis
'ఐపీఎల్‌లో ఇంత దూరం ప్రయాణిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కెప్టెన్సీ బాధ్యతలు వదిలేశాక చాలా రిలాక్సింగ్‌గా ఉంది. పూర్తి స్థాయి బ్యాటర్‌గా పునరుత్తేజంతో రాణించాలనుకుంటున్నాను. చాలా ఏళ్ల తర్వాత ఎలాంటి బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం దొరికింది. జట్టు కోసం ఏం చేయాలో నాకు పూర్తి స్పష్టత ఉంది. జట్టు విజయం కోసం శాయశక్తులా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాను' అని కోహ్లీ చెప్పాడు. 2008 నుంచి కోహ్లీ ఆర్సీబీ జట్టు తరఫున ఆడుతున్నాడు. 2013లో సారథ్య బాధ్యతలు చేపట్టి 2021 సీజన్ వరకు జట్టుని ముందుండి నడిపించాడు. గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ.. ఈ సీజన్‌లో పూర్తి స్థాయి బ్యాటర్‌గా బరిలోకి దిగనున్నాడు.
'మా జట్టు యాజమాన్యం పక్కా ప్రణాళికతోనే ఐపీఎల్ మెగా వేలంలో డు ప్లెసిస్‌ను కొనుగోలు చేసింది. ఎందుకంటే, మా జట్టుకు అనుభవమున్న నాయకుడి అవసరం ఉంది. టెస్టు కెప్టెన్‌గా అతడికి గొప్ప రికార్డు ఉంది. అలాంటి ఆటగాడు ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం వహించడం పట్ల మేమంతా సంతోషిస్తున్నాం. అతడు జట్టును సరైన దిశలో నడిపిస్తాడనే నమ్మకం ఉంది. డు ప్లెసిస్ కెప్టెన్సీలో మా జట్టు ఆటగాళ్లందరూ గొప్పగా రాణిస్తారనుకుంటున్నాను' అని విరాట్ కోహ్లీ అన్నాడు. గతేడాది వరకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు తరఫున ఆడిన డుప్లెసిస్‌ను.. ఐపీఎల్ మెగా వేలంలో రూ.7 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది.
ఇదీ చదవండి:'ఒకే మైదానం- ఐదు పిచ్‌లు'.. ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త ప్లాన్