Virat Kohli ODI Captaincy: తనను వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ ఇటీవల తప్పించిన తర్వాత తొలిసారిగా విరాట్ కోహ్లీ మీడియా ముందుకు వచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటున్నట్లు ప్రకటించాడు. అదే విధంగా వన్డేల్లో తనను కెప్టెన్గా తొలగించడంపైనా స్పందించాడు.
"ఈ నెల 8న టెస్టు జట్టును ప్రకటించే గంటన్నర ముందు సెలెక్టర్లతో నేను ఫోన్లో మాట్లాడాను. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీసీఐకి, నాకు సరైన కమ్యునికేషన్ లేదు. టెస్టు జట్టు ప్రకటించే గంటన్నర ముందు నన్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు సెలెక్టర్లు చెప్పారు. నేను సరే అన్నా. అలాగే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని నన్ను ఎవరూ కోరలేదు."