Virat Kohli on AB de Villiers: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్పు గెలిస్తే ఏబీ డివిలియర్స్ చాలా సంతోషిస్తాడని ఆ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. టైటిల్ గెలిచిన తర్వాత తనకు తొలుత గుర్తొచ్చేది డివిలియర్సే అని చెప్పుకొచ్చాడు. అతడు ప్రత్యేకమైన వ్యక్తి అని కోహ్లీ అన్నాడు. డివిలియర్స్ ఆటకు వీడ్కోలు పలికిన క్షణాలను కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.
RCB IPL 2022:"వచ్చే సీజన్లలో మేం టైటిల్ గెలవగలిగితే.. నాకు ముందుగా డివిలియర్సే గుర్తొస్తాడు. మేం కప్పు గెలిస్తే.. అతడికి చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. అతడు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు నాకు వింతగా అనిపించింది. ఆరోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రపంచకప్ తర్వాత మేం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో నాకు డివిలియర్స్ ఓ వాయిస్ నోట్ పంపాడు. అయితే, డివిలియర్స్ ఈ నిర్ణయం తీసుకుంటాడనే సందేహం నాకు గత సీజన్‌లోనే అనిపించింది. అప్పుడు నాతో మాట్లాడుతూ 'నీతో కలిసి కాఫీ తాగాలి. చాలా మాట్లాడాలి' అని చెప్పేవాడు. నాకు ఏదోలా అనిపించి నేను కాఫీకి రానని చెప్పేశా. అప్పుడే తన విషయంలో ఏదో జరుగుతుందని గ్రహించా" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.