Virat Kohli ODI Century Record :అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అందులో ఒకటి.. వన్డేల్లో 49 సెంచరీలు నమోదు చేయడం. అయితే కొన్ని రోజుల క్రితం వరకు ఈ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యం అని అందరూ భావించారు. కానీ అద్భుత ఫామ్లో ఉన్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాచ్ కోహ్లీ.. వన్డేల్లో ఇప్పటివరకు 48 సెంచరీలు బాది ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి అడుగు దూరంలో ఉన్నాడు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇలాంటి సమయంలోనూ కోహ్లీ.. తాను ఎప్పుడూ వ్యక్తిగత మైలురాళ్ల కోసం క్రికెట్ ఆడలేదనే విషయాన్ని అంతర్లీనంగా తెలియజేశాడు. అంతేకాకుండా ఇంత సుదీర్ఘ కాలం తనను జట్టులో కొనసాగేలా చేసి.. 78 అంతర్జాతీయ సెంచరీలు.. 26 వేలకుపైగా పరుగులు సాధించేలా చేసినందుకు దేవుడికి కృజ్ఞతలు తెలిపాడు.
'మనం క్రికెట్ గురించి మాట్లాడినట్లయితే.. నా కెరీర్ ఇంత సూదీర్ఘ కాలం కొనసాగుతుందని, ఇదంతా సాధిస్తానని అనుకోలేదు. అయితే నేను ఎదో ఒకటి చేయాలని కలలు కనేవాడిని. కానీ అది ఇలానే చేయాలని ఎప్పుడూ ప్లాన్స్ చేయలేదు. నేనే కాదు ఎవరూ ఇలా చేయలేరు. ఈ 12 ఏళ్లలో ఇన్ని సెంచరీలు, ఇన్ని పరుగులు చేస్తానని అనుకోలేదు' అని ఓ స్పోర్ట్స్ ఛాన్ల్తో మాట్లాడుతూ కోహ్లీ చెప్పాడు.
సెంచరీ లేకుండా మూడేళ్లు..
దాదాపు మూడేళ్లు ఒక్క సెంచరీ చేయకుండా ఉన్న కోహ్లీ.. ఫామ్ కోల్పోయి విమర్శల పాలయ్యాడు. ఇక విరాట్ కథ ముగిసింది అని అందరూ భావించారు. ఈ క్రమంలో అలాంటి విమర్శలన్నీ పటాపంచలు చేస్తూ గతేడాది సెంప్టెంబర్ సెంచరీ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విరాట్.. వన్డేల్లో 5, టీ20ల్లో 1, టెస్టుల్లో 2 సెంచరీలతో మొత్తం 8 శతకాలు బాదాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్లో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. టోర్నీ మొత్తంగా ఆరో స్థానంలో ఉన్నా డు.