Virat Kohli Mock Chicken Tikka :టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే ఓ స్పెషల్ మెనూను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. 'మాక్ చికెన్ టిక్కా' అనే వంటకానికి సంబంధించిన ఫొటోను అప్లోడ్ చేశారు. "ఈ మాక్ చికెన్ టిక్కాను మీరు తప్పక ఇష్టపడతారు" అంటూ క్యాప్షన్‌ను జోడించారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు.
విరాట్ కోహ్లీ కొంత కాలం నుంచి కేవలం వెజిటేరియన్ ఫుడ్‌ను తింటున్న విషయం తెలిసిందే. ఆరోగ్య సంబంధ సమస్యల కారణాల వల్ల అతడు నాన్‌వెజ్ నుంచి వెజిటేరియన్‌గా మారాల్సి వచ్చిందని కూడా పలు మార్లు వెల్లడించారు. దీంతో ఈ తాజా పోస్ట్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా అవాకయ్యారు. 'విరాట్ ఎప్పుడో శాకాహారిగా మారిపోయారు కదా మరి ఇదేంటి' అంటూ కామెంట్ల వర్షాన్ని కురిపించారు. మరికొందరేమో ఈ పేరు కొత్తగా ఉండటం వల్ల అసలు ఈ డిష్ ఏంటో అంటూ నెట్టింట తెగ ఆరా తీస్తున్నారు.
అయితే, ఓ అభిమాని మాత్రం నెట్టింట సెర్చ్ చేసి దీనికి చక్కటి సమాధానం ఇచ్చాడు." కొంతమందికి చికెన్ టిక్కాకు మాక్ చికెన్ టిక్కాకు తేడా తెలియడం లేదు. ఇది పూర్తిగా వెజిటేరియన్ డిష్. ఓ రకమైన మొక్కల నుంచి తయారు చేసిన ఆహారం. దీని అర్థం తెలియక కోహ్లీ నాన్‌వెజ్ తిన్నాడంటూ కాంటవర్సీలు చేస్తున్నారు" అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు తొలుత ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ డిష్‌ను తాము కూడా ట్రై చేస్తామంటూ ఆ ఫొటోను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.