Virat Kohli Medal: ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో.. మిచెల్ మార్ష్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. అతడి బంతి ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. దీంతో అక్కడే సెకెండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్.. ఎడమవైపు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ ఒడిసిపట్టాడు. దీంతో ఒక్కసారిగా మార్ష్ షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న సమయంలో భారత ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ విరాట్‌కు ఓ పతకాన్ని మెడలో వేశాడు. ఈ మ్యాచ్ ఫీల్డింగ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను కోహ్లికి ఈ మెడల్ వేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక పోర్టల్‌లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 'మనం చేసే పనుల్లో కాస్త వైవిధ్యం ప్రదర్శిస్తే మంచి గుర్తింపు సాధించవచ్చు' అని పేర్కొన్నారు. ఇందుకుగాను విరాట్ డైవింగ్ క్యాచ్‌కు దిలీప్ అత్యుత్తమ ఫీల్డర్ పతకాన్ని అందజేశారు అని అన్నారు. అయితే ఉత్తమ ఫీల్డర్‌గా విరాట్ పేరు అనౌన్స్ చేయగానే అతడు ముఖంపై చిరునవ్వుతో పరిగెత్తుతూ దిలీప్ వద్దకు చేరుకున్నాడు. మెడలో పతకం వేయగానే విరాట్ దాన్ని ముద్దుగా కొరికాడు.