Virat Kohli Instagram Post : ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓటమిపాలైనప్పటి నుంచి టీమ్ఇండియాపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అసలు సిసలు మ్యాచుల్లో చేతులెత్తేయడం భారత జట్టుకు అలవాటైపోయిందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో టీమ్ఇడియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కూడా విమర్శలు వస్తున్నాయి. అతడు అవుటైన విధానాన్ని అందరూ తప్పుబడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు చాలా కష్టాల్లో ఉండగా ఆఫ్‌స్టంప్ ఆవల పడిన బంతిని ఆడబోయిన కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీనిపై సునీల్ గవాస్కర్, వసీం జాఫర్ వంటి మాజీలతోపాటు చాలా మంది ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడే కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని క్రిప్టిక్ పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడు. మ్యాచ్ నాలుగో రోజు ముగిసిన తర్వాత ఒక్కోసారి అన్నీ వదిలేయడం కూడా నేర్చుకోవాలంటూ హితబోధ చేశాడు.
ఇప్పుడు మరోసారి అలాంటి ఒక కొటేషన్‌ను షేర్ చేశాడు. దీనిలో మార్పు గురించి ప్రస్తావించే కొటేషన్‌ను కోహ్లీ పోస్టు చేశాడు. 'మార్పును సరిగా అర్థం చేసుకోవాలంటే.. దానిలో దూకాలి, దాంతోపాటు నడవాలి చివరకు ఆ మార్పుతో కలిసి డ్యాన్స్ చేయాలి' అనే అలన్ వాట్స్ కొటేషన్‌ను కోహ్లీ పంచుకున్నాడు. ఇలా కోహ్లీ ఎందుకు కొటేషన్లు షేర్ చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం అతడిపై కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కోహ్లీ ఇలా క్రిప్టిక్ పోస్టులు పెట్టడం వెనుక ఏదో జరిగే ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. జట్టులో ఏదో జరగడం వల్లనే అతడు ఇలా చేస్తున్నాడని ఫీల్ అవుతున్నారు.
విండీస్ పర్యటనకు టీమ్ఇండియా
India Vs West Indies Tour 2023 : వరుసగా రెండోసారి ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ఓటమిపాలైన భారత క్రికెట్ జట్టు.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అందులో భాగంగా టీమ్ఇండియా.. ఆతిథ్య జట్టు విండీస్‌తో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇటీవలే విండీస్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. వచ్చే వారంలో భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జూన్ నెలలో ఆఫ్ఘన్‌తో సిరీస్ పెట్టాలని అనుకున్నా.. కొన్ని అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. దీంతో జులైలో జరిగే వెస్టిండీస్ సిరీస్‌తోనే భారత జట్టు మళ్లీ మైదానంలో దిగనుంది.