టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై(Virat kohli) మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ప్రశంసల జల్లు కురిపించాడు. 30 ఏళ్లకే కోహ్లీ లెజండరీ క్రికెటర్‌గా మారాడని కొనియాడాడు. 20 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన కోహ్లీ.. తక్కువకాలంలోనే స్టార్ క్రికెటర్‌గా మారాడని యూవీ అన్నాడు.
"కోహ్లీకి జాతీయ జట్టులో అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకున్నాడు. టీమ్ఇండియాలోకి వచ్చినప్పుడు కోహ్లీ చాలా చిన్నవాడు. అంతలోనే 2011 ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ, కోహ్లీ మధ్య అప్పుడు పోటీ ఉండేది. ఆ సమయంలో కోహ్లీ ఎక్కువ పరుగులు చేశాడు. ఆ కారణంతోనే అతడికి జాతీయ జట్టులో స్థానం లభించింది. అప్పటితో పోలిస్తే కోహ్లీలో చాలా మార్పు కనిపిస్తోంది."
- యువరాజ్, టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్
బ్యాట్స్‌మన్‌గా ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ.. ఆ తర్వాత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైనా, పరుగుల దాహాన్ని వీడలేదని వెల్లడించాడు యూవీ. "కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా ఎన్నో పరుగులు చేసి.. కెప్టెన్ అయ్యాడు. కొన్నిసార్లు బ్యాటింగ్‌లో విఫలమైనా.. స్థిరత్వం మాత్రం కోల్పోలేదు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఎంతో సాధించాడు. క్రికెటర్లు సాధారణంగా రిటైర్ అయ్యే సమయంలో లెజెండ్స్‌గా మారతారు. కానీ, కోహ్లీ 30 ఏళ్లకే లెజండరీ క్రికెటర్‌గా అవతరించాడు. అతడు రిటైర్ అవ్వడానికి ఇంకా సమయం ఉన్న కారణంగా.. కోహ్లీ మరెన్నో ఘనతలు సాధించగలడు" అని యువరాజ్ సింగ్ తెలిపాడు.
విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం యూకేలోని దుర్హమ్‌లో ఉన్నాడు. ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. జులై 20 నుంచి ఇంగ్లాండ్ కౌంటీ జట్టుతో టీమ్ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఇంట్రా-స్క్వాడ్ జరగనుంది. పటౌడీ సిరీస్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి..ఆ పడకలు యాంటీ-సెక్స్ కాదు.. సాక్ష్యం ఇదిగో!