Virat Kohli 1000 days Without Scoring: ఒకప్పుడు అతడు బ్యాట్ పడితే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టేది. వరుసగా మూడు నాలుగు మ్యాచ్‌లకు ఓ సారి శతకాలు చితక్కొట్టేవాడు. అతడే టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ. కానీ ఇప్పుడు ఫామ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే గడిచిన 1000 రోజుల నుంచి అతడు ఒక్క సెంచరీ కూడా బాదక పోవడమే కారణం. దీంతో విరాట్ ఫామ్ కోల్పోయాడనే అందరు అనుకుంటున్నారు. జట్టు నుంచి కూడా తప్పించాలని మాజీల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, కోహ్లీ 2019 నవంబర్ 23న వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సీరిస్‌లో భాగంగా సెకండ్ మ్యాచ్‌లో చివరిసారిగా శతకం చేశాడు. అప్పటి నుంచి 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినా.. ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక 2019లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
చివరిగా చేసిన సెంచరీ తర్వాత విరాట్ 18 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 32 ఇన్నింగ్స్‌లో 27.25 సగటుతో 872 పరుగులు చేశాడు. ఆరుసార్లు 60 పరుగుల మార్క్‌ను దాటాడు. అందులో అత్యధికంగా 79 పరుగులు చేశాడు. ఓడీఐ మ్యాచ్‌లు 23 ఆడితే, అందులో 35.83 సగటుతో 824 పరుగులు సాధించాడు. సెంచరీ కొట్టలేక పోయినా.. అత్యధికంగా 89 పరుగులు బాదాడు. టీ ట్వంటీ ఫార్మట్లో 27 మ్యాచ్‌ల్లో 858 పరుగులు 42.90 సగటుతో చేశాడు. అందులో సెంచరీ మిస్ అయ్యి, అత్యధికంగా 94 పరుగులు, ఎనిమిది అర్ధ సెంచరీలు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 82 ఇన్నింగ్స్‌లో 34.05 సగటుతో 2,554 పరుగులు తీశాడు. మొత్తంగా 24 అర్థ శతకాలు బాదాడు.
అయితే అంతకు ముందుతో పోలిస్తే కోహ్లీ ఫామ్ పడిపోయింది. 2020,2021,2022 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా 1000 పరుగుల మార్క్‌ని దాటలేదు. 2019లో చివరి సెంచరీ చేశాక, అదే సంవత్సరం చివరిదాకా 68 సగటుతో 272 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అందులో 94 బెస్ట్‌తో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2020లో 22 మ్యాచుల్లో 24 ఇన్నింగ్స్ ఆడితే, 36.60 సగటుతో 842 పరుగులు చేశాడు. అందులో అత్యధికంగా 89 పరుగులు బాదాడు. 2021లో 24 మ్యాచ్‌ల్లో 30 ఇన్నింగ్స్ ఆడి, 37.07 సగటుతో 964 పరుగులు చేశాడు. అందులో అత్యధికంగా 80 పరుగులు బాది, పది అర్ధ శతకాలు చేశాడు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు అత్యంత పేలవ ప్రదర్శణ చేశాడు. 16 మ్యాచుల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడి, 476 మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 79తో సగటు 25.05 శాతానికి పడిపోయింది.